మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర రన్ టైం అందరిని ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉంది. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ గురించే ప్రస్తుతం దేశం మొత్తం చర్చ జరుగుతోంది. జక్కన్న రాజమౌళి తనదైన శైలిలో ప్రచార కార్యక్రమాలు చేస్తూ సినిమాకి హైప్ మరింత పెంచుతున్నారు. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయిపోయింది. అంటే ఇక వారం రోజులోనే ఆర్ఆర్ఆర్ థియేటర్స్ లో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ రిలీజ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి 'యు/ఏ ' సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక్కడ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది ఆర్ఆర్ఆర్ రన్ టైం. ఆర్ఆర్ రన్ టైం ఏకంగా మూడు గంటలు దాటేసింది. బాహుబలి 2 చిత్రాన్ని మించిపోయింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ రన్ టైంని 3 గంటల 6 నిమిషాల 54 సెకండ్లు గా ఫిక్స్ చేశారు. 

అంటే ఇంటర్వెల్ తో కలుపుకుని ప్రేక్షకులు దాదాపు మూడున్నర గంటల పాటు థియేటర్స్ లో ఉండాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఇంత లాంగ్ రన్ టైం కలిగిన మూవీ మరేదీ లేదు. బాహుబలి 2 చిత్ర రన్ టైం 2 గంటల 47 నిమిషాలు. రాంచరణ్ రంగస్థలం మూవీ రన్ టైం 2 గంటల 54 నిముషాలు ఉంటుంది. 

ఆర్ఆర్ఆర్ రన్ టైం వల్ల చాలా థియేటర్స్ లో మూవీ ప్రదర్శించే టైమింగ్స్ లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎంత పెద్ద రన్ టైం అయినా ప్రేక్షకుల్ని సినిమా నుంచి డీవియేట్ కాకుండా ఎలా కట్టి పడేయాలో జక్కన్నకి బాగా తెలుసు. ఇక రాజమౌళి సినిమాల్లో కథలు చాలా పెద్దవిగా ఉంటాయి. అందుకే నిడివి 3 గంటలు దాటి పోయింది. 

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ లని అల్లూరి, కొమరం భీం పాత్రల్లో చూసేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటించారు. అలియా భట్ సీత పాత్రలో నటించింది.