దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకేక్కిస్తోన్న 'RRR' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు. 

వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటినుండే ఈ సినిమా బిజినెస్ ని కూడా మొదలుపెట్టారు. ముందుగా నిర్మాత దానయ్య ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ని విక్రయించడానికి చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 'సాహో' సినిమా ఓవర్సీస్ రైట్స్ కొన్న దుబాయ్ సంస్థనే 'RRR' రైట్స్ కోసం 66 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు  తెలుస్తోంది.

అయితే దానయ్య మాత్రం ఆ రేటుకి రైట్స్ ఇవ్వాలని అనుకోవడం లేదట. ఓవర్సీస్ రైట్స్ 70 కోట్లకు పైగా విక్రయించాలనేది దానయ్య ఆలోచన. 'బాహుబలి' తరువాత ఆ రేంజ్ లో వస్తోన్న సినిమా కావడంతో దానయ్య భారీ మొత్తాలకు సినిమాను అమ్మాలని చూస్తున్నారు. 

పైగా రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబో అంటే డిమాండ్ మాములుగా ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో ఓవర్సీస్ మార్కెట్ అంత గొప్పగా జరగడం లేదు. అక్కడి బయ్యర్లు సినిమాలు కొనడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. మరి 'RRR'కి ఎంత రేటు పలుకుతుందో చూడాలి!