యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న క్రేజీ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే కావడంతో ఆసక్తి నెలకొంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 350 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి కొంత భాగం షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్ కోసం  బల్గేరియా బయలుదేరి వెళ్ళింది. 

ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ మాత్రమే పాల్గొంటాడు. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని రాజమౌళి ఎన్టీఆర్ పై  బల్గేరియాలో చిత్రీకరించనున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గురువారమే చిత్ర యూనిట్ బల్గేరియా వెళ్లారు. 

1920 బ్రిటిష్ కాలం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. రాంచరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్నాడు. కొమరం భీం, అల్లూరి యుక్తవయసులో అజ్ఞాతంలోకి వెళ్లిన అంశాన్ని తీసుకు రాజమౌళి ఈ చిత్రాన్ని కల్పితగాధగా తెరకెక్కిస్తున్నాడు. రాంచరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ కు ఇంకా హీరోయిన్ ని ఖరారు చేయలేదు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవ్ గన్, తమిళనటుడు సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.