దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. సౌత్ లో ఇటీవల ఎన్నడూలేని విధంగా ఇద్దరి సమకాలీన స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఇది. బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి చిత్రం రూపొందిస్తాడో అని ప్రేక్షకుల ఎదురుచూస్తుండగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రకటించారు. డివివి దానయ్య నిర్మాతగా ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

రాజమౌళి తెరక్కించే సినిమా అంటే ప్లానింగ్ పక్కాగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా రాజమౌళి స్కెచ్ కు తిరుగులేదు అని భావించారు. కానీ ఆర్ఆర్ఆర్ నిర్మాణం అనుకున్నంత సాఫిగా జరగడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు స్టార్ హీరోలతో భారీ మల్టీస్టారర్ చిత్రం కత్తిమీద సాము లాంటిదే. రాంచరణ్ షూటింగ్ లో గాయపడడం వల్ల ఉత్తర భారతంలో ప్లాన్ చేసిన షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా గాయపడ్డాడు. 

దీనితో షూటింగ్ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2020 జులై 30న విడుదల చేస్తాం అని ఇప్పటికే ప్రకటించేశారు. పరిస్థితులు చూస్తుంటే సినిమా అనుకున్న సమయానికి పూర్తయ్యేలా లేదు. ఇక బడ్జెట్ విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. సినిమా ఆలస్యం అయ్యే కొద్దీ బడ్జెట్ పెరుగుతూనే ఉంటుంది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి దృష్టిలో అయ్యే లెక్క 350 నుంచి 400 కోట్లు. కానీ కేవలం ఇంటర్వెల్ సన్నివేశానికే 50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

రాంచరణ్, ఎన్టీఆర్ పై చిత్రీకరించే ఇంట్రడక్షన్ సాంగ్ కు 3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్ ఇలా భారీ కాస్టింగ్ ఉంది. ఇందంతా చూస్తుంటే ఆర్ఆర్ఆర్ షూటింగ్, బడ్జెట్ విషయంలో రాజమౌళి లెక్క తప్పే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.