సంగీత దర్శకుడు కీరవాణి, చంద్రబోస్ సంయుక్తంగా ఆస్కార్ వేదికపైకి వెళ్లి అత్యుత్తమ పురస్కారం అందుకున్నారు. కీరవాణి ఆస్కార్ అవార్డు అందుకుంటున్న క్షణాలు చూసి ఇండియా మొత్తం పులకరించి పోయింది.
గత కొన్ని వారాలుగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ వచ్చింది.అనేక ప్రశంసలు పొందింది. హాలీవుడ్ అభిమానుల హృదయాలు దోచుకుంది. అవన్నీ ఒకెత్తయితే ఇది ఒక్కటీ మరో ఎత్తు.. 130 కోట్ల మంది భారతీయులు గర్వించేలా తెలుగోడు తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. మన 'నాటు నాటు' పాటకి పట్టం కడుతూ అకాడమీ అవార్డ్స్ సంస్థ ఆస్కార్ అవార్డు ప్రకటించింది.
సంగీత దర్శకుడు కీరవాణి, చంద్రబోస్ సంయుక్తంగా ఆస్కార్ వేదికపైకి వెళ్లి అత్యుత్తమ పురస్కారం అందుకున్నారు. కీరవాణి ఆస్కార్ అవార్డు అందుకుంటున్న క్షణాలు చూసి ఇండియా మొత్తం పులకరించి పోయింది. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల హృదయాలు కొల్లగొట్టింది. వెస్ట్రన్ ఆడియన్స్ సైతం రిపీట్ గా ఈ చిత్రాన్ని చూసారు. నాటు నాటు పాటకి చిందేశారు.

రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, కీరవాణి సంగీతం, నాటు నాటు సాంగ్.. రాంచరణ్, ఎన్టీఆర్ పోరాటాలు ప్రతి ఒక్కరిని కట్టిపడేశాయి. ఇంత క్రేజ్ సాధించినప్పటికీ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ జర్నీ అంత సులభంగా సాగలేదు. ఇండియా తరుపున పలు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్స్ కి షార్ట్ లిస్ట్ అవుతుందని అంతా భావించారు.
కానీ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) జ్యురి మెంబర్స్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి మొండి చేయి చూపారు. ఒక్క విభాగంలో కూడా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నామినేట్ చేయలేదు. గుజరాత్ కి చెందిన 'చేల్లో షో' అనే చిత్రాన్ని షార్ట్ లిస్ట్ చేశారు. ఆ చిత్రం ఆస్కార్స్ లో ఎంట్రీ సాధించలేకపోయింది. ఆర్ఆర్ఆర్ ని పక్కన పెట్టి గుజరాత్ చిత్రాన్ని షార్ట్ లిస్ట్ చేయడం వెనుక చాలా కోణాలు ప్రచారంలో ఉన్నాయి. పొలిటికల్ ప్రభావం ఉందని కూడా ఊహాగానాలు వినిపించాయి.

అయితే ఆర్ఆర్ఆర్ షార్ట్ లిస్ట్ కాకపోవడంతో రాజమౌళి సైతం నిరాశ చెందారు. కానీ విశ్వాసం కోల్పోలేదు. తన బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సహాయంతో ఫారెన్ ఎంట్రీ నుంచి గట్టి ప్రయత్నం చేశారు. ఆర్ఆర్ఆర్ కి ఉన్న క్రేజ్ తో అంతర్జాతీయ అవార్డులు దాసోహం అవుతూ వచ్చాయి. ఈ చిత్ర ప్రభావం హాలీవుడ్ లో ఒక ఫీవర్ లాగా వ్యాపించింది. ఆస్కార్స్ కి ఎంట్రీ కూడా లభించింది. చివరకి ఫైనల్ నామినేషన్స్ లో నిలిచి చరిత్ర సృష్టించింది.
ఆస్కార్ తర్వాత అంతటి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ పురస్కారం కూడా నాటు నాటు పాటకి దక్కింది. దీనితో ఆస్కార్ అవార్డు నాటు నాటు పాటకి ఖాయం అనే అంచనాలు పెరిగాయి. దీనితో రాజమౌళి యుఎస్ లో తన హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ తో కలసి ప్రమోషన్స్ జోరు పెంచారు. చివరకు నాటు నాటు సాంగ్ మ్యాజిక్ చేస్తూ భారతీయులంతా గర్వపడే విధంగా ఆస్కార్ అవార్డు కైవసం చేసుకుంది.
ఆర్ఆర్ఆర్ ని షార్ట్ లిస్ట్ చేయకపోవడంతో FFI దారుణంగా ట్రోలింగ్ కి గురైంది. దీనిపై FFI మెంబర్స్ వివరణ ఇస్తూ.. మార్కెటింగ్ స్ట్రాటజీ, పాపులారిటీ, వినోదం, కలెక్షన్స్ ఆధారంగా ఆస్కార్స్ కి షార్ట్ లిస్ట్ చేయాలా అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించడం FFI కి నాటైన చెంపపెట్టు అనే చెప్పాలి.
