Asianet News TeluguAsianet News Telugu

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

  • రజినీ, అక్షయ్, శంకర్ ల కాంబినేషన్ లో రోబో 2.0
  • రోబో 2.0 రిలీజ్ కు మరింత ఆలస్యం
  • అంచనాల ప్రకారం ముందుకు సాగని 2.0 పనులు
robo 2 release post poned again

సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో 2.0. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం 2.0కు మరింత హైప్ క్రియేట్ చేసింది. దాంతో రోబో 2.0 చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి.

 

తాజాగా రోబో2 చిత్ర రిలీజ్ గురించి ఓ పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. జనవరి 25న ఈ చిత్రం రిలీజ్ కావడం లేదని ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా చేసిన ట్వీట్ సినీ వర్గాలను గందరగోళంలో పడేసింది. గతంలో రోబో2.0ను దీపావళికి విడుదల చేయాలని భావించారు. ఆ తర్వాత 2017 జనవరి 25 తేదీకి మార్చారు. అయితే రోబో2.0 చిత్రం ఆ తేదీకి కూడా విడుదల కావడం లేదట. ఆ చిత్రాన్ని ఏప్రిల్ 13 తేదీకి వాయిదా వేశారని రమేశ్ బాలా ట్వీట్ చేశారు.

 

రోబో రిలీజ్ డేట్ వాయిదా పడటం వల్లే అక్షయ్ కుమార్ తాను నటించిన ప్యాడ్‌మ్యాన్ చిత్రాన్ని జనవరిలో రిలీజ్ చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించడం కూడా ఈ వార్తకు బలం చేకూరుస్తోంది. అత్యంత సాంకేతికతతో రోబో2ను తీర్చిదిద్దుతున్నారు. వీఎఫ్‌ఎక్స్ పనులను శరవేగంతో చేస్తున్నారు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం పనులు జరుగకపోవడం వల్ల రోబో2ను వాయిదా వేయాలనుకొంటున్నట్టు సమాచారం. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంపై కచ్చితమైన సమాచారం అందుబాటులోకి రాలేదు.

 

రోబో2.0 చిత్రం పూర్తిగా 3డీ ఫార్మాట్‌లో రూపొందిస్తున్నారు. కేవలం 3డీ ఫార్మాట్ కోసం రోబో2ను రూపొదించడం లేదు. కథ డిమాండ్ చేయడం వల్లే 3డీ ఫార్మాట్‌లో చిత్రీకరించామని... ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతికి లోనవడం గ్యారెంటీ అని.. చిత్ర నిడివి కేవలం 140 నిమిషాలు మాత్రమే వుంటుందని దర్శకుడు శంకర్ తెలిపారు.

 

రోబో2.0 చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ రూపొందిస్తున్నది. ఈ చిత్ర బడ్జెట్ 400 కోట్లు. ఆసియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రంగా ఓ ఘనతను సాధించింది. ఈ చిత్రంలో రజనీ, అక్షయ్‌తోపాటు ఎమీజాక్సన్, సుధాంశు పాండే, ఆదిల్ హుస్సేన్ తదితరులు నటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios