బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు పూర్తిగా రియా చక్రవర్తి మెడకు  చుట్టుకుంటోంది. ఇప్పటికే ముంబై, పాట్నా పోలీసులతో పాటు సీబీఐ కూడా రియాను విచారంచింది. తాజాగా నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు రియా ఇంట్లో శుక్రవారం సోదాలు నిర్వహించారు. రియా, సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చేదన్న ఆరోపణలు వినిపించటం, రియా సోదరుడికి డ్రగ్‌ పెడలర్స్‌తో సంబంధాలు ఉన్నట్టుగా తేలటంతో రియా ఇంట్లో సోదాలు నిర్వహించారు.

ఈ రోజు ఉదయం 6:30 ప్రాంతంలో సోదాలు ప్రారంభించిన అధికారులు, ఆ తరువాత రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు వెల్లడించకపోయినా ప్రస్తుతం డ్రగ్‌ పెడ్లర్స్‌తో సంబంధాల గురించి ప్రశ్నించేందుకే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సోదాల్లో భాగంగా షోవిక్ ల్యాప్‌టాప్‌ను అధికారులు సీజ్ చేశారు.

రియా ఇంటితో పాటు సుశాంత్ సహాయకుడు సామ్యూల్‌ మిరండా ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు 20 ఏళ్ల విలట్రా వీరికి డ్రగ్స్ సప్లయ్‌ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అబ్దెల్ బాసిత్ అనే వ్యక్తి విలట్రాను షోవిక్‌, సామ్యూల్‌లకు పరిచయం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.