రెండు భాగాలుగా ఆర్జీవీ `వ్యూహం`.. ఈ రెండు వచ్చేది అప్పుడే!
రామ్‌గోపాల్ వర్మ.. `వ్యూహం `పేరుతో ఓ సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే. దాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. విడుదల తేదీలను ప్రకటించారు.

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. ఏపీ పాలిటిక్స్ పై వరుసగా సినిమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అందరి చూపు తనవైపు తిప్పుకుంటున్నారు. తాజాగా ఎలక్షన్ల హడావుడి ప్రారంభమైంది. దీంతో ఇక తన సినిమాలను రంగంలోకి దించుతున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ రాజకీయాలపై `వ్యూహం` పేరుతో సినిమాని తెరకెక్కించాడు. ఆ మధ్య టీజర్ విడుదల చేసి ఆకట్టుకున్నారు.
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్టు తెలుస్తుంది. వైఎస్ చనిపోవడంతో చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్లాన్స్ చేశాడు, అధికారంలోకి రావడానికి ఏం చేశాడనే అంశాలను ఇందులో చూపించబోతున్నట్టు ఆ టీజర్ ని చూస్తే అర్థమయ్యింది. అదే సమయంలో తండ్రి చనిపోవడంతో తనయుడు జగన్, వారి ఫ్యామిలీ ఎంతగా మానసికంగా కుమిలిపోయిందని, వారి ఫ్యామిలీలో చోటు చేసుకున్న పరిణామాలను చూపించబోతున్నారట.
ఆ మధ్య ఈ సినిమాతో హడావుడి చేసిన వర్మ.. ఆ తర్వాత సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు ఎన్నికల సందడి స్టార్ట్ కాబోతుంది. ఏపీలో మార్చిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తన అస్త్రాలను బయటకు తీశారు. `వ్యూహం` చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు దీన్ని రెండు పార్ట్ లుగా ఆయన తెరపైకి తీసుకురాబోతుండటం విశేషం. `వ్యూహం`, `శపథం`(వ్యూహం2) పేర్లతో రిలీజ్ చేయబోతున్నారట.
తాజాగా దీనికి సంబంధించిన రిలీజ్ డేట్లని ప్రకటించారు. `వ్యూహం` మూవీని నవంబర్ 10ని రిలీజ్ చేస్తున్నట్టు, అలాగే `శపథం` చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. రెండు నెలల గ్యాప్‌తో ఈ రెండు చిత్రాలను ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఏపీ ఎన్నికలను ప్రభావితం చేయాలనే ఉద్దేశ్యంతో వర్మ ఈ రిలీజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇందులో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో మానస రాధకృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖ నిరోషా, వాసు ఇంటూరి, కోట జయరాం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.