సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇటీవల 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో సక్సెస్ అందుకున్న వర్మ ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రమోషన్స్ సమయంలోనే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే టైటిల్ తో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు.  'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రమోషన్స్ కోసం వర్మ ఈ సినిమా అనౌన్స్ చేసి ఉంటాడని.. సినిమా పట్టాలెక్కడం కష్టమేననే మాటలు వినిపించాయి.

కానీ వర్మ చెప్పినట్లుగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాను మొదలుపెట్టాడు. ఎప్పుడు మొదలైందో.. ఎంతవరకు కంప్లీట్ చేశారో తెలియదు కానీ శుక్రవారం ఉదయం 9 గంటలకు సినిమాలో తొలిపాట ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమా ఎలాంటి వివాదాలకు తావివ్వదని చెబుతున్నాడు వర్మ.

'ది మోస్ట్ నాన్ కాంట్రవర్శియల్ ఫిలిం' అంటూ చెప్పుకుంటున్నాడు. అందులో కూడా ఒకరకమైన వెటకారం కనిపిస్తోంది. నిజంగానే వర్మ ఎలాంటి వివాదాలు లేకుండా ఈ సినిమాను రూపొందిస్తాడా..? లేక పబ్లిసిటీ కోసమే ఈ కబుర్లు చెబుతున్నాడో తెలియాల్సివుంది!