ఒక్కోసారి ఎంతో ఆలోచించి, ఎంతో తెలివిగా మాట్లాడమనుకుంటాం కానీ అడ్డంగా దొరికిపోతాం. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రతీది ఆచి,తూచి అడుగు వేయాలి. ఏ మాత్రం పొరపాటు దొర్లినా అడ్డంగా బుక్కైపోతాం. ఇప్పుడు వర్మ పరిస్దితి అలాగే మారింది. రీసెంట్ గా తనకు కరోనా లేదని, ఈ విషయం తన గురించి ప్రచారం చేస్తున్న వారికి బాధను కలిగించే అంశమంటూ ఇటీవల సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ తో వర్మ అడ్డంగా దొరికిపోయారు. రానున్న రోజుల్లో ఈ ట్వీట్ కారణంగా ఆయన ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయని మీడియా వర్గాలు చెప్తున్నాయి. 

వివరాల్లోకి వెళ్తే, అమృత, ప్రణయ్, మారుతీరావు కథతో వర్మ తాజాగా 'మర్డర్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తనదైన శైలిలో ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అయితే ఈ సినిమాపై అమృత కోర్టును ఆశ్రయించారు. దీంతో, అమృత పిటిషన్ కు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఇప్పటికే వర్మకు ఆదేశాలను జారీ చేసింది.

 అయితే, వర్మకు కరోనా సోకిందని... అందువల్ల అఫిడవిట్ పై సంతకం చేయలేకపోయారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఆగస్టు 14కి కోర్టు వాయిదా వేసింది.

అయితే, కోర్టుకు వర్మ తప్పుడు సమాచారం అందించారని అమృత ఆరోపించారు. తనకు కరోనా సోకలేదనే విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారని చెప్పారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని అమృత తరపు లాయర్ తెలిపారు. దీనిపై కోర్టు ఎలా స్పందించబోతోందో వేచి చూడాలంటున్నారు.