వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తరచుగా ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తుంటాడు. వర్మ చేసే వ్యాఖ్యల సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంటాయి. ఇదిలా ఉండగా వర్మ సైరా చిత్రం గురించి పాజిటివ్ గా స్పందిస్తూ ట్వీట్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి విషయంలో తాను కొన్నేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని ఓ వీడియో కూడా పోస్ట్ చేశాడు. 

కొన్నేళ్ల క్రితం చిరంజీవి, బిగ్ బి అమితాబ్, పూరి జగన్నాధ్, రామగోపాల్ వర్మ కలసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది చిరంజీవి రాజకీయాల్లో ఉన్న సమయం. వర్మ ప్రసంగిస్తూ.. చిరంజీవి గారి నుంచి 100 రోజులు, 150 రోజులు, 250 రోజులు ఆడిన సినిమాలు వచ్చాయి. అలాంటిది ఆయన సినీ కెరీర్ 149తో ముగియకూడదు. ఆయన తప్పకుండా 150వ చిత్రం చేయాలి అని వర్మ కోరారు. 

చిరంజీవి కనుక 150 వ చిత్రం చేస్తే అమితాబ్ బచ్చన్ గారు గెస్ట్ రోల్ లో నటిస్తారు అని వర్మ తెలిపాడు. పక్కనే ఉన్న అమితాబ్.. అవును చిరంజీవి సినిమా చేస్తే అందులో గెస్ట్ రోల్ చేయడానికి నేను సిద్దమే అని వేదికపైనే తెలిపాడు. ఆ చిత్రానికి నేనే దర్శకుడిని అని పూరి జగన్నాధ్ కూడా సరదాగా వ్యాఖ్యానించారు. 

వర్మ చెప్పిన సంగతులు 150వ చిత్రంలో జరగలేదు కానీ.. మెగాస్టార్ ప్రతిష్టాత్మకంగా నటించిన 151వ చిత్రం సైరాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో నేను చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయంటూ వర్మ తాజాగా ట్వీట్ చేశాడు.