‘మీటూ’ ఉద్యమానికి సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు మద్దతు తెలుపుతుంటే మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ మాత్రం ‘మీటూ’ను మూణ్ణాళ్ల ముచ్చటగా సంబోధించిన సంగతి తెలిసిందే. దాంతో మోహన్ లాల్ పై మహిళా నటీమణులు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా రేవతి సోషల్ మీడియాలో మోహన్ లాల్ మాటకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. 

రేవతి ట్వీట్ చేస్తూ‘‘మీటూ ఓ ఫ్యాషన్‌ అని ఓ పాపులర్‌ యాక్టర్‌  అన్నారు. అలాంటి వాళ్లలో సున్నితత్వం ఎలా తీసుకురాగలం? దర్శకురాలు అంజలీ మీనన్‌ చెప్పినట్టు ‘వేధింపులకు గురి అవ్వడం ఎలా ఉం టుందో వాళ్లకేం తెలుసు?  బహుశా వాళ్లంతా గ్రహాంతరవాసులు అయ్యుండొచ్చు. జరిగిన చేదు అనుభవాలు బయటకు చెప్పడానికి ఎంత ధైర్యం కావాలో వాళ్లకు తెలియదు. అది ఎలాంటి మార్పు తీసుకొస్తుందో కూడా వాళ్లకు తెలియదు కదా’’ అని ట్వీట్‌ చేశారు రేవతి. ఈ ట్వీట్ తో అగ్గి రగల్చినట్లైంది. ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో అని కేరళ సిని పరిశ్రమ అంటోంది. 

అసలు మోహన్ లాల్ ఏమన్నారు..

దుబాయ్‌లో జరగబోయే మలయాళ యాక్టర్స్‌ ఛారిటీ ఈవెంట్‌ గురించి మాట్లాడటానికి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ‘అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌’ (అమ్మ) ప్రెసిడెంట్‌గా మోహన్‌లాల్‌ ‘మీటూ’ గురించి మాట్లాడారు. 

‘‘మలయాళ ఇండస్ట్రీలో ఎటువంటి సమస్యా లేదు. లైంగిక వేధింపులు ఎక్కడైనా జరుగుతాయి.కేవలం సినిమా ఇండస్ట్రీలో అని అనుకోవడం కరెక్ట్‌ కాదు. అయినా ‘మీటూ’ అనేది ఓ ఫ్యాషన్‌లా తయారైంది. ఇలాంటివి ఎక్కువ కాలం నిలబడలేవు. కేవలం మూణ్ణాళ్ల ముచ్చట అవుతాయి. అయినా ‘మీటూ’ మీద నేను కామెంట్‌ చేయలేను. దాన్ని అనుభవిస్తేగాని మాట్లాడకూడదు’’ అని పేర్కొన్నారు.