పవన్ కళ్యాణ్ విడాకుల విషయంలో రీసెంట్ గా సంచలన వ్యాఖ్యలు చేసిన రేణుదేశాయ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది. పవన్ పై ఆమె చేసిన కామెంట్స్ అభిమానులను ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమెపై విరుచుకుపడ్డారు. కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న రేణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె తన సినిమాల గురించి చెప్పుకొచ్చింది.

నటిగా సినిమాలు చేసిన ఆమె పవన్ ని వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు దూరమయ్యారు. నాలుగేళ్ల క్రితం ఆమె 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. అయితే ఇప్పుడు మరోసారి డైరెక్టర్ గా సినిమా చేయడానికి సిద్ధమవుతోంది. అది కూడా తెలుగులో అని తెలుస్తోంది. రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని రేణు వెల్లడించారు.

దీనికోసం ఆమె ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని పల్లెటూర్లకు వెళ్లనున్నారు. అక్కడ రైతుల పరిస్థితిని అర్ధం చేసుకొని సినిమాను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు సమాచారం. మొత్తానికి రేణు త్వరలోనే డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నమాట!