రేణు దేశాయ్‌.. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్యగా సుపరిచితం. అంతకు మించి ఆమె ప్రస్తుతం దర్శకురాలిగా రాణిస్తున్నారు. ఇప్పటికే ఆమె `ఇష్క్ వాలా లవ్‌` చిత్రాన్నిరూపొందించి దర్శకురాలిగా నిరూపించుకుంది. కానీ ఆ సినిమా పరాజయం చెందింది. తాజాగా మరో సినిమాకి సన్నాహాలు చేస్తుంది. 

ఈ సారి రేణు దేశాయ్‌ రైతు సమస్యలపై సినిమా తీసేందుకు ప్లాన్‌ చేస్తుంది. ఈ సినిమాలో ఓ పాట కోసం ప్రముఖ ప్రజా కవి, రచయిత గోరేటి వెంకన్నని రేణు దేశాయ్‌ కలిశారు. ఆదివారం గోరేటి వెంకన్న ఫామ్‌ హౌజ్‌లో కలిసి ఆయనతో అనేక విషయాలను పంచుకుంది. 

ఆ విశేషాలను రేణు చెబుతూ, `ఎంతో ఆత్మీయత, ప్రేమ. పాటల సెషన్‌ కోసం గోరేటి వెంకన్నగారి ఫామ్‌కి వెళ్ళాను. రైతులపై తీసే నా సినిమా కోసం ఆయన పాట రాయడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఆయన భార్య నా కోసం మట్టి పాత్రల్లో ఎంతో రుచికరంగా అన్నం, పప్పు, రోటీ పచ్చడి చేశారు. ఎంతో సాధారణ జీవితాన్ని గడుపుతున్న వారితో ఆదివారం మధ్యాహ్నం మంచి అనుభూతిని పొందాను` అని రేణు తెలిపింది.

మరి రేణు దేశాయ్‌ దర్శకురాలిగా రైతులపై ఎలాంటి సినిమా తీస్తుందో చూడాలి. ఇటీవల తన కెరీర్‌ ప్రారంభం నాటి ఫోటోలను పంచుకున్న విషయం తెలిసిందే.