పవన్ కళ్యామ్ పై విమర్శల దాడి చేస్తున్న క్రిటిక్ కత్తి మహేష్ కత్తి మహేష్ విమర్శలపై స్పందించిన రేణు దేశాయ్ పవన్ గురించి సరిగ్గా తెలియకే అలా మాట్లాడుతున్నారన్న రేణు దేశాయి
పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ గత కొంత కాలంగా తెలుగు ప్రజల అటెన్షన్ తనవైపు తిప్పుకున్న క్రిటిక్, బిగ్ బాస్ హౌజ్ కంటెస్టంట్ మహేష్ కత్తి పవన్ పై విమర్శలు మాత్రం ఆపటంలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మహేష్ కత్తిని టార్గెట్ చేసి ట్రోలింగ్ చేయటమే కాక... ఏకంగా చంపేస్తామంటూ కొందరు బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా చేసినట్లు వార్తల్లో చూస్తునే వున్నాం. పవన్ కళ్యాణ్ సినిమాల మీద, ఆయన రాజకీయ జీవితం మీద మహేష్ కత్తి విమర్శలు చేయడంతో.... పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగానే స్పందించారు.
తాజాగా మహేష్ కత్తి వివాదంపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా స్పందించారు. ముంబైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పబ్లిసిటీ కోసమే పవన్ కళ్యాణ్ మీద కొందరు ఇలాంటి చీప్ కామెంట్లు చేస్తున్నారని, అసలు తనకు కత్తి మహేష్ ఎవరో కూడా తెలియదని అన్నారు. వపన్ కళ్యాణ్ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వారు ఎవరూ ఇలాంటి విమర్శలు చేయరని, మహేష్ కత్తి లాంటివారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని రేణు దేశాయ్ అన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ మీద మహేష్ కత్తి ట్విట్టర్లో మరోసారి విరుచుకుపడ్డారు. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యపై పవన్ ట్వీట్ చేయగా... పవన్ కళ్యాణ్ ట్వీట్లోని తప్పులను ఎత్తి చూపుతూ మహేష్ కత్తి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో గౌరీ లంకేశ్ పేరును గౌరీ శంకర్ అని పేర్కొన్నారు. దీన్ని గుర్తించిన మహేష్ కత్తి... హత్యకు గురైన జర్నలిస్ట్ పేరు గౌరీ శంకర్ కాదు గౌరీ లంకేశ్ అంటూ పవన్ తప్పును ఎత్తి చూపారు.
మోదీ, హిందుత్వ విధానాలకు మద్దతు తెలిపిన పవన్ ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడని, ఈ హత్య కేసులో నిజానిజాలు తేలేవరకు మాట్లాడను అంటున్నాడు, పవన్ కులాలకు, మతాలకు అతీతమైన వ్యక్తని.. అలాగే జ్ఞానం లేని వ్యక్తని తనకు ఇప్పుడు అర్థమైందని మహేష్ కత్తి విమర్శించారు.
