పవన్ కళ్యాణ్ అభిమానులనుద్దేశించి మరోసారి స్పందించిన రేణు దేశాయి సమాజం ఇంకా ఇలా వుందా అంటూ రేణు దేశాయి స్పందన మగవాళ్లకోన్యాయం, ఆడాళ్లకో న్యాయం ఎందుకని ప్రశ్న
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... తన రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు.. చేసుకోవాలని అనిపిస్తోందని.. ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఒక తోడుంటే బావుండనిపిస్తుందని చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం అర్థం చేసుకోవాల్సిన అసరం వుంది. కానీ ఆమె వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. అలాంటి ఆలోచన మమానుకోవాలని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.
దీంతో రేణుదేశాయి కూడా అదే సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు కుండబద్ధలు కొట్టారు. మన సమాజం ఒక మహిళ పట్ల ఎంత వివక్ష చూపుతోందో అర్థం చేసుకున్నానని చెప్పింది. మగవాళ్లు ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు కాని, ఇన్నేళ్ల తర్వాత తాను ఒక తోడు ఉంటే బాగుండు అని అంటేనే.. కొందరు అభ్యంతరకర పోస్టులు చేశారని ఆమె బాధ పడ్డారు.
తన సోషల్ మీడియా పోస్టులో... 'ఈ పోస్ట్ కేవలం నా వ్యక్తిగత సమస్య ఉద్దేశించి మాత్రమే కాదు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం. ఇలాంటి ఆలోచన తీరున్న మగవాళ్ల మధ్య ఉన్నామని ఆందోళన చెందాల్సి వస్తుంది. సమాజంలో ఓ వైపు మహిళా సమానత, ఆడపిల్లలు శక్తి స్వరూపం, అత్యాచారాల నుంచి మహిళలను కాపాడాలి. వారి భద్రతకు చర్యలు తీసుకోవాలి అంటుంటాం. మరో వైపు ఏడేళ్లు ఒంటరిగా ఉన్న నేను ఇప్పుడు ఒకరి తోడు అవసరమని మాట్లాడితే అసహ్యించుకుంటున్నట్లు సందేశాలు పంపుతున్నారు.
మన దేశంలో ఓ మగాడు ఏమైనా చేయొచ్చు. ఎన్నిసార్లయినా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఓ అమ్మాయి మరో బంధం గురించి ఆలోచించడం కూడా తప్పా? జీవితాంతం తప్పు చేశానన్న భావనతో ఏ తోడు లేకుండా బతకాలా? ఇవాళ నేను దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. మన దేశంలో అమ్మాయిల భవిష్యత్తు మెరుగ్గా ఉండాలంటే, తల్లులు వాళ్ల కొడుకులను పద్ధతిగా పెంచాలి. అప్పుడైనా మగవాళ్ల ఆలోచనా విధానంలో మార్పు వస్తుందేమో' అంటూ రేణు దేశాయ్ తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై ట్రోలింగ్ ఎక్కువవటంతో రేణు మరో పోస్ట్ చేశారు. నేను కళ్యాణ్ గిరి ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఎక్కడా ఏమీ అనలేదు. అయినా నన్ను క్షోభపెడుతున్నారు. నేను నా ఒక్కదాని కోసం మాట్లాడలేదు. ఈ సమాజంలో పరిస్థితి ఎలా వుందో, దానిపై నా అభిప్రాయాలేంటో చెప్పే ప్రయత్నం చేశానన్నారు. ప్రతి ఒక్కరికి అక్క, చెల్లి, తల్లి వున్నారు కదా.. వాళ్లకోసం ఆలోచించండి. నా ఒక్కదాని కోసం ఆలోచించాలని నేను అడగట్లేదు. ఛానెళ్లు కూడా డ్రామా క్రియేట్ చేయకుండా.. దీనిపై పాజిటివ్ గా స్పందిస్తారని ఆశిస్తున్నాను. అంటూ తన ఆవేదన మరోసారి వెళ్లగక్కారు రేణు దేశాయి.
