క్రితం సంవత్సరం భారీ అంచనాలతో, బడ్జెట్ తో రిలీజైన  'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రం దారుణమైన పరాజయం పాలవ్వడం  బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్  ఆలోచనలో పడేసింది. దాంతో వెంటనే ఏ సినిమా చేయాలి..ఏది వర్కవుట్ అవుతుందనే విషయమై  అమీర్ ఖాన్ తన టీమ్ లో గత కొంతకాలంగా చర్చలు చేస్తున్నరు. ఎన్నో కథలు విన్నారు. కానీ  వెంటనే ఏదో ఒక సినిమా కమిటయ్యి... చేసేందుకు ఆయనకు ధైర్యం చాలడం లేదు.

ఈ నేపధ్యంలో ఓ హాలీవుడ్ చిత్రం రైట్స్  తీసుకున్నారు. ఆల్రెడీ ప్రపంచం అంతా మెచ్చుకున్న చిత్రాన్ని రీమేక్ గా చేసేందుకు సిద్దపడుతున్నట్లు సమాచారం. హాలీవుడ్‌లో విజయం సాధించిన ‘ఫారెస్ట్‌ గంప్‌’ చిత్రం హిందీ రీమేక్‌ హక్కుల్ని అమీర్‌ కొనుగోలు చేశారట. టామ్‌ హాంక్స్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ అనే నవల ఆధారంగా తెరకెక్కింది. అప్పట్లో ఈ చిత్రం భారీ విజయం సాధించడమే కాదు ఆరు ఆస్కార్‌ పురస్కారాలను కూడా గెలుచుకుంది.   అమీర్ ఖాన్ స్వయంగా రైట్స్ తీసుకున్నాడని రీమేక్ చేసి హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే అమీర్ ఖాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉండటంతో ఇలా అందరికీ తెలిసిన ఓ రీమేక్ చేస్తే అంతర్జాతీయ మార్కెట్ లో బిజినెస్ కు ఇబ్బంది అవుతుందని, ఆ రీమేక్ వద్దని ట్రేడ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయట. అయినా ఫారెస్ట్ గంప్ కోసం పూర్తిగా తన లుక్ మార్చుకుని  ఆ కథని మన నేటివిటిలోకి మార్చి  త్వరలో ప్రారంభించబోతున్నారని వినికిడి.