ఇప్పటికే ఒక సారి ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో ఇరుక్కున్న జబర్దస్త్ కమెడియన్‌ హరి.. ఇప్పుడు మరోసారి ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్టు సమాచారం. 

జబర్దస్త్ కమెడియన్‌ హరి గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో ఇరుక్కున్నాడు. ఆ టైమ్‌లో అరెస్ట్ కూడా అయ్యాడు. అప్పట్లో ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా మరోసారి ఆయనపై స్మగ్లింగ్‌ కేసు నమోదు కావడం గమనార్హం. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో హరి ఇరుక్కోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నారని సమాచారం. అతని ముఠాకి చెందిన కిషోర్‌ అనే వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.60 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం (జూన్ 11) రాత్రి పుంగనూరు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు శివారు ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి రెండు వాహనాలు తప్పించుకునేందుకు ప్రయత్నం చేయగా, గమనించిన పోలీసులు ఆ రెండు వాహనాలను అడ్డగించి పట్టుకున్నారు. ఈ క్రమంలో ఓ వాహనం డ్రైవర్ పోలీసుల కన్ను కప్పి పరార్ కాగా, మరో వాహనం డ్రైవర్ కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాలను తనిఖి చేయగా దాదాపు అరవై లక్షల విలువ గల పంతొమ్మిది ఏ గ్రేడ్ ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, రెండు వాహనాలను సీజ్ చేశాం` అని తెలిపారు. 

అయితే కమెడియన్‌ హరి మాత్రం పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అతని కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే అతనిపై ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ ద్వారా హరి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలున్నాయి. దీంతో పలు కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు మరోసారి అతని పేరు తెరపైకి రావడం ఆశ్చర్యపరుస్తుంది. 

హరి అనేక ఇబ్బందులు పడి జబర్దస్త్ లోకి వచ్చాడు. ఇందులో లేడీ గెటప్‌లో కనిపిస్తూ అలరిస్తున్నారు. తనదైన పంచ్‌లు, డబుల్ మీనింగ్‌ డైలాగ్‌లతో అలరిస్తున్నారు. హరితగా పాపులర్‌ అయ్యారు. జబర్దస్త్ ద్వారా ఇంతటి పేరుతెచ్చుకున్న హరి ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో ఇరుక్కోవడం షాక్‌కి గురి చేస్తుంది.