టాలీవుడ్‌లో బ‌యోపిక్స్ ట్రెండ్‌కు తెర‌తీసిన సినిమా 'మ‌హాన‌టి'. అలనాటి మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెర‌కెక్కించారు. ఈ చిత్రం ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద ఘన  విజ‌యం నమోదు చేసింది.  అయితే రిలీజైన ఇంతకాలం తర్వాత   ఈ సినిమా గురించి  బాలీవుడ్ న‌టి దీపిక చూసి ఈ సినిమాని రికమెండ్ చేసారు.అయితే ఇప్పుడు పనిగట్టుకుని మహానటి సినిమాని దీపిక ఎందుకు చూసింది...ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా అనేది టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తన తదుపరి చిత్రంలో ప్రభాస్ సరసన నటించమని ఆమెను కోరటం జరిగింది. మరో ప్రక్క తనకున్న పరిచయాలతో దీపికను..నాగ్ అశ్విన్  డైరక్ట్ చేసిన సినిమా చూడమని చెప్పారట. ఆ సినిమా చూసిన దీపిక ..నాగ్ అశ్విన్ మేకింగ్ స్టైల్ కు, డైరక్షన్ స్కిల్స్ కు ఫిదా అయ్యిపోయిందని అంటున్నారు. 

ప్రస్తుతం బాలీవుడ్ నటి దీపిక పదుకోని సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉంది. తన భర్తతో కలిసి హాయిగా కాలక్షేపం చేస్తూ గడుపుతోంది. అదే సమయంలో ముంబై లో తన ఇంట్లో ఉంటూ సినిమాలను చూస్తూ గడుపుతోంది. అలాగే తన ఫాలోవర్లను కూడా తాను చెప్పిన సినిమాలను చూడాలని కోరుతోంది. తాజాగా దీపిక తెలుగు సినిమా మహానటిని చూసింది. అవార్డు విన్నింగ్ సినిమా అయిన మహానటిని చూడాలంటూ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో స్పష్టం చేసింది దీపిక..! అలాగే నాగ్ అశ్విన్ ను కూడా ట్యాగ్ చేసింది దీపిక.


‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ నటించారు. ఆమె భర్త జెమిని గణేశన్‌ పాత్రను దుల్కర్‌ సల్మాన్‌ పోషించారు. సమంత, విజయ్‌ దేవరకొండ కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందించిన ఈ చిత్రం 2018 మేలో విడుదలై మంచి హిట్‌ అందుకుంది.  వైజయంతి మూవీస్‌, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా విమర్శకులతో పాటు ప్రముఖుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రానికి గానూ కీర్తి సురేశ్‌ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించారు.