యువ హీరో సంతోష్ శోభన్ నటించిన 'పేపర్ బాయ్' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మొదట ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు. ట్రైలర్ ఫీల్ గుడ్ సినిమా అవుతుందని నమ్మకం కలిగించినా.. ప్రమోషన్స్ వీక్ గా ఉండడంతో సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లలేకపోయింది. ఎప్పుడైతే గీతాఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నారో.. సినిమాపై బజ్ క్రియేట్ అయింది.

నిజానికి ఈ సినిమా హక్కులు తీసుకోవాలనే ఆలోచన అల్లు అరవింద్ కి లేదట. ఇండస్ట్రీలో ఆల్రెడీ ప్రివ్యూ చూసిన వారు సినిమా ఆడదనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ విషయం అల్లు అరవింద్ కి కూడా తెలుసు. కానీ మెహర్ రమేష్.. అల్లు అరవింద్ ని ఒప్పించినట్లు తెలుస్తోంది. ఫ్లాప్ సినిమాలతో క్రేజ్ పోగొట్టుకున్న మెహర్ రమేష్ కి ఇండస్ట్రీలో మాత్రం పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి.

ప్రతి పార్టీలో ఆయన కనిపిస్తూనే ఉంటారు. అల్లు కాంపౌండ్ లో కూడా మెహర్ రమేష్ కనిపిస్తుంటారు. 'పేపర్ బాయ్' సినిమా హక్కులు అల్లు అరవింద్ కి అంటగట్టిన విషయంలో మెహర్ రమేష్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవింద్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో వెల్లడించారు. 'ఎవరినైనా ఒప్పించడంలో, ఒక మాట మీదకు తేవడంలో మెహర్ రమేష్ దిట్ట. పేపర్ బాయ్ విషయంలో కూడా నన్ను అలానే ఒప్పించాడు' అంటూ అల్లు అరవింద్ చెప్పాడు.

సో.. మెహర్ రమేష్ కారణంగానే అల్లు అరవింద్ అడ్డంగా బుక్కైపోయారు. ఈ సినిమాకి మొదటిరోజు నుండే నెగెటివ్ టాక్ రావడం, లాంగ్ రన్ లో అసలు వర్కవుట్ అయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో అల్లు అరవింద్ కి నష్టాలు తప్పకపోవచ్చని అంటున్నారు.