ఓ పక్క మహేష్ బాబు సినిమా, మరోపక్క అల్లు అర్జున్ సినిమా.. ఈ రెండు భారీ బడ్జెట్ స్టార్ హీరోలతో పోటీ పడడానికి సిద్ధమయ్యాడు కళ్యాణ్ రామ్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న మహేష్, బన్నీ సినిమాలతో పాటు తన సినిమాను కూడా రంగంలోకి దింపడానికి ప్లాన్ చేస్తున్నాడు.

దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇద్దరు స్టార్ హీరోలతో కళ్యాణ్ రామ్ పోటీకి దిగడాన్ని చాలా మంది నమ్మలేకపోయారు. కానీ దానికి కారణం దిల్ రాజు అని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ నటిస్తోన్న 'ఎంత మంచివాడవురా' సినిమాను పంపిణీ చేయడానికి దిల్ రాజు ముందుకొచ్చారు. మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో ఈ సినిమాను విడుదల చేస్తానని యూనిట్ కి మాటిచ్చారు.

అందుకే కళ్యాణ్ రామ్ పోటీకి సిద్ధమయ్యాడు. దర్శకుడు సతీష్ వేగ్నేసపై దిల్ రాజుకి నమ్మకముంది. ఆయన తీసిన 'శతమానం భవతి' సినిమా సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అయింది. ఆ తరువాత సతీష్ వేగ్నేస ఓ ఫ్లాప్ సినిమా తీసినప్పటికీ ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తోన్న 'ఎంత మంచివాడవురా' సినిమాపై దిల్ రాజు నమ్మకంగా ఉన్నాడు.

సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నా.. మరో సినిమా కూడా ఆడే ఛాన్స్ ఉంటుందనేది దిల్ రాజు నమ్మకం. అందుకే కళ్యాణ్ రామ్ ని రంగంలోకి దింపుతున్నాడు.