అప్పట్లో వచ్చిన  ప్రేమ పావురాలు (‘మైనే ప్యార్‌ కియా’) సినిమా సక్సెస్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది  బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ. సల్మాన్‌ ఖాన్‌, భాగ్యశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అంటే ఈ సినిమా టీవీల్లో వస్తే టీఆర్పీలు అదిరిపోతాయి. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. 

దాంతో అందరూ  భాగ్యశ్రీ బాలీవుడ్ లో నెంబర్ వన్ అయిపోతుందనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆమెకి వరుసగా సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆమె ఆ తర్వాత కేవలం మూడు సినిమాలు అదీ తన భర్తతోనే ఆమె చేసారు. ‘మైనే ప్యార్‌ కియా’రిలీజైనన తర్వాతి సంవత్సరమే ప్రముఖ వ్యాపారవేత్త హిమాలయా దస్సానీని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో బిజి అయ్యి... ఆ తర్వాత సినిమాలు మానేశారు. 

ఆ తర్వాత ఆమె సినిమాలు చేయకపోవటానికి కారణం ...తను హీరోయిన్ గా చేసే  సినిమాలో హీరోగా ఆమె భర్త నటిస్తేనే చేస్తానని భాగ్యశ్రీ చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అసలు కారణం అది కాదని భాగ్యశ్రీ అంటున్నారు. తన మాటలు తప్పుగా అర్దం చేసుకున్నారంటోంది. 

చాలా కాలం గ్యాప్  తర్వాత భాగ్యశ్రీ ‘కిట్టీ పార్టీ’ అనే మహిళా నేపథ్య సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా భాగ్యశ్రీ తాను సినిమాలు మానేయడానికి కారణమేంటో వెల్లడించారు.

‘నా భర్త హిమాలయాజీ హీరోగా చేస్తేనే నటిస్తానన్నానని వార్తలు వచ్చాయి. నేను అలా అనలేదు. సినిమాలో మరో వ్యక్తితో రొమాన్స్‌ చేయడం నాకు ఇష్టంలేదు. కేవలం నా భర్తతో మాత్రమే అలాంటి సన్నివేశాల్లో నటిస్తాను..అని చెప్పాను’ అన్నారు. 

‘కిట్టీ పార్టీ’ చిత్రంలో మధుబాల, సదా, సుమన్‌ రంగనాథన్‌, దీప్తి భట్నాగర్‌, హరితేజ, పూజా ఝవేరీ, హర్షవర్ధన్‌ రానే నటిస్తున్నారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమాకు సంబంధించిన లోగోను విడుదల చేశారు. భాగ్యశ్రీ కుమారుడు అభిమన్యు త్వరలో ‘మర్ద్‌ కో దర్ద్‌ నహీ హోగా’ అనే చిత్రంతో తొలిసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.