కోలీవుడ్‌ మన్మథుడు శింబు పుట్టిన రోజు నేడు(బుధవారం). ఈసందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న బహుభాషా చిత్రం `రీవైన్డ్` తెలుగు టైటిల్‌ని, టీజర్‌ని విడుదల చేశారు మాస్‌ మహారాజా రవితేజ. ఇటీవల ఆయన `క్రాక్‌` చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకుని ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక తమిళంతోపాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శింబు ప్రస్తుతం కళ్యాణి ప్రియదర్శన్‌ తో కలిసి `మానాడు` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. వి హౌజ్‌ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత సురేష్‌ కామాచి దాదాపు 125కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

శింబు బర్త్ డే సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు టైటిల్‌ `రీవైన్డ్`ని విడుదల చేశారు రవితేజ. దీంతోపాటు టీజర్‌ని కూడా పంచుకున్నారు. శింబు నటిస్తున్న మల్టీలింగ్వల్ భారీ బడ్జెట్‌ చిత్రం తెలుగు వెర్షన్‌ టీజర్‌ రిలీజ్‌ చేయడం ఆనందంగా ఉందని రవితేజ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బర్త్ డే విషెస్‌ తెలిపారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం.

ప్రముఖ దర్శకులు భారతీరాజా, ఎస్‌.ఏ.చంద్రశేఖర్‌, ఎస్‌.జె.సూర్య, కరుణాకరన్‌ ఇతర ప్రధాన తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. తమ చిత్ర టీజర్ ని రవితేజ విడుదల చేయడం పట్ల `రీవైన్డ్` దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.   ఈ చిత్రం హిందీ టీజర్ ప్రముఖ దర్శకులు అనురాగ్ కశ్యప్, తమిళ్ టీజర్ ఏ.ఆర్.రెహమాన్, కన్నడ టీజర్ కిచ్చా సుదీప్ రిలీజ్ చేయడం విశేషం.