ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న చిత్ర పరిశ్రమపై కరోనా పంజా విసురుతుంది. పలువురు చిత్ర ప్రముఖులకు కరోనా సోకడం జరిగింది. రోజుల వ్యవధిలో టాలీవుడ్ కి చెందిన నటులు, దర్శకులు ఇతర సాంకేతిక నిపుణులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. వకీల్ సాబ్ టీమ్ లో అనేక మంది కరోనా బారినపడ్డారు. ఈ చిత్ర ప్రొమోషన్స్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం పవన్ తన ఫార్మ్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. 


తాజాగా దర్శకుడు రమేష్ వర్మకు కరోనా సోకినట్లు ఆయన వెల్లడించాడు. ట్విట్టర్ సందేశం ద్వారా తనకు కరోనా సోకినట్లు తెలియజేశారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే తాను క్వారంటైన్ కావడంతో పాటు, చికిత్స తీసుకుంటున్నట్లు తెలియజేశారు. అలాగే అందరూ మాస్క్ ధరించాలని, అత్యవసరాలకు మినహాయించి, బయట తిరగడం మానివేయాలని సూచించారు. 


వచ్చే నెలలో ఖిలాడి విడుదల నేపథ్యంలో రమేష్ వర్మకు కరోనా సోకడం ఇబ్బందికరంగా మారింది. మే 28న ఖిలాడి మూవీ విడుదల కావాల్సి ఉండగా వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కరోనా మిగతా చిత్రాల షూటింగ్స్ పై కూడా ప్రభావం చూపిస్తుంది. చిరంజీవి ఆచార్య షూటింగ్ కి తాత్కాలిక బ్రేక్ వేశారు. సినిమా థియేటర్స్ మరలా 50శాతం కెపాసిటీతో నడుపనున్నారని సమాచారం అందుతుంది. మొత్తంగా కరోనా టాలీవుడ్ కి నిద్రలేకుండా చేస్తుంది.