మాస్ మహరాజ్ రవితేజ మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించేశారు. దర్శకుడు రమేష్ వర్మతో ఆయన ఓ మాస్ ఎంటర్టైనర్ లైన్ లో పెట్టాడు. ఈ ప్రాజెక్ట్ పై ఇదివరకే ప్రకటన రాగా నేడు అధికారికంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రవితేజ ఇమేజ్ కి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఖిలాడి అనే టైటిల్ నిర్ణయించారు. టైటిల్ తోనే సినిమాపై చిత్ర యూనిట్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక బ్లాక్ టీ షర్ట్ ధరించి టక్ చేసి ఉన్న రవితేజ పోజ్ ఆసక్తి రేపుతుండగా, బ్యాక్ గ్రౌండ్ లో గాల్లో ఎగురుతున్న కరెన్సీ నోట్లు మూవీ కథనంపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. 

హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ లో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నేడు ఈ మూవీ పూజా కార్యక్రమాలతో మొదలైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గత ఏడాది విడుదలైన రాక్షసుడు మూవీతో మంచి హిట్ అందుకున్న రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో మూవీపై బజ్ ఏర్పడింది. 

రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఆయన పోలీస్ రోల్ చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవల అప్సరా రాణి జంటగా రవితేజపై ఓ ఐటమ్ సాంగ్ షూట్ చేశారు. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. క్రాక్ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.