వరుస ఫ్లాప్‌ల్లో ఉన్న మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల `క్రాక్‌` సినిమాతో విజయాన్ని అందుకున్నారు. దీంతో పూర్వ వైభవాన్ని పొందాడు. ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. దీంతో వరుసగా సినిమాలను ఓకే చెబుతున్నాడు. ప్రస్తుతం ఆయన రమేష్‌ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ వీడియోలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆదివారం మరో సినిమాని ప్రకటించాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిపారు రవితేజ.

త్రినాథరావు నక్కినతో రవితేజ సినిమా చేయబోతున్నట్టు గతంలోనే వార్తలు వినిపించాయి. కానీ దానిపై రవితేజగానీ, దర్శకుడు త్రినాథరావు నక్కిన గానీ స్పందించలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి తన ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేస్తూ రవితేజ ఈ సినిమాని ప్రకటించాడు. తన 68వ చిత్రంగా ఇది రూపొందనుంది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం సాగుతుందని, దీన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్‌, అభిషేక్‌, వివేక్‌ కూచిభోట్ల నిర్మించనున్నారు.  కుమార్‌ బెజవాడ దీనికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. 

ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. త్రినాథరావు నక్కిన గతంలో `సినిమా చూపిస్త మావ`, `నేనులోకల్‌`, `హలో గురు ప్రేమకోసమే` చిత్రాలను రూపొందించిన విషయం తెలిసిందే.