కొన్ని చెప్పి చేస్తారు..మరికొన్ని ఎవరికీ తెలియకూడదని సినిమా వాళ్లు భావిస్తూంటారు. అలాంటివి రీమేక్ సంగతులు. తాము రీమేక్ రైట్స్ తీసుకున్నా కూడా కొందరు గుప్తంగా ఉంచుతారు. మరికొందరు కాపీ కొడుతూ ఆ విషయం బయిటపడకూడదని ప్రయత్నిస్తూంటారు. కానీ మీడియా మామూలుగా లేదుగా. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే చందాన నడుస్తున్నాయి. ఇలాంటప్పుడు విషయాలు సీక్రెట్ గా ఉంచటం చాలా కష్టం. ఇదే విధంగా రవితేజ కొత్త సినిమా గుట్టు కూడా రట్టైంది అంటున్నారు. 

రవితేజ తాజా చిత్రంగా 'క్రాక్' సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఆ తరువాత ఆయన రెండు ప్రాజెక్టులను సెట్  చేసుకున్నాడు. ఒక సినిమాకి రమేశ్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. మాస్ మహరాజా రవితేజ  67వ సినిమాకు సంబంధించి టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి 'ఖిలాడి' అనే టైటిల్ ను ఖరారు చేశారు.  జయంతిలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ మూవీస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ..తమిళంలో అరవింద్ స్వామి, త్రిష జంటగా నటించిన ‘శతురంగ వేట్టై-2’ కథతో  తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. గతంలో వచ్చిన ‘శతురంగ వేట్టై’ తమిళంలో సెన్సేషనల్ హిట్టయింది. దీన్నే తెలుగులో ‘బ్లఫ్ మాస్టర్’గా తీశాడు.  అలాంటి కథతోనే ‘శతురంగ వేట్టై-2’ తెరకెక్కింది. ఐతే వేరే కారణాల వల్ల ఆ సినిమా కొన్నేళ్లుగా విడుదలకు నోచుకోకుండా ఉంది. ఈ సినిమా రైట్స్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం బయిటకు చెప్పటం లేదు. 

ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో ఆ పాత్రలు ఎలా వుండనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. చిత్రంలో రవితేజ...చార్టర్డ్ అకౌంటెంట్ గా .. ఎన్ ఆర్ ఐ బిజినెస్ మేన్ గా  కనిపించనున్నట్టు తెలుస్తోంది. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్ .. మాళవిక శర్మ అలరించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 'మరో అద్భుత ప్రయాణానికి సర్వం సిద్ధం' అని రవితేజ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. తెలుగులో  ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.