మాస్ మహారాజ రవితేజ వరుస ఫ్లాప్ లతో వెనుకబడ్డాడు. రీసెంట్ గా విడుదలైన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా కూడా ఫ్లాప్ కావడంతో డీలా పడ్డాడు. తన తదుపరి సినిమా దర్శకుడు వి.ఐ.ఆనంద్ తో చేయాలనుకుంటున్నాడు.

'ఎక్కడకి పోతావు చిన్నవాడా' చిత్రంతో పేరు తెచ్చుకున్న వి.ఐ.ఆనంద్ తనకు కచ్చితంగా సక్సెస్ ఇస్తాడనే నమ్మకంతో సినిమాకి సై అన్నాడు. నిర్మాత రామ్ తాళ్లూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాలి. ప్లాన్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో నవంబర్ నాటికి సెట్ వర్క్ పూర్తవ్వాలి. డిసంబర్ 1 నుండి షూటింగ్ మొదలుపెట్టాలి. కానీ ఇప్పటివరకు సెట్ వర్క్ పూర్తికాలేదు.

నిర్మాత రామ్ తాళ్లూరికి రవితేజతో ఈ సినిమా చేయడం ఇష్టం లేదని, పైగా రెమ్యునరేషన్ గా రవితేజ రూ.10 కోట్లు డిమాండ్ చేయడంతో రామ్ తాళ్లూరి ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. రవితేజకి మార్కెట్ లో డిమాండ్ తగ్గడంతో ఇప్పుడు అతడితో సినిమా చేయడం రిస్క్ అని భావిస్తున్నాడట నిర్మాత.

ఇది ఇలా ఉండగా.. ఇప్పటివరకు సినిమా సెట్ వర్క్ పూర్తికాకపోవడం, షూటింగ్ మొదలుపెట్టకపోవడంతో రవితేజ.. దర్శకుడు విఐ ఆనంద్ ముందే నిర్మాత రామ్ తాళ్లూరి మీద అరిచేశాడట. దీంతో ఇప్పుడు అసలు సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా..? లేక ఆగిపోతుందా..? అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి 'డిస్కో రాజా' అనే టైటిల్ కూడా అనుకున్నారు.