ఆడదని ముందు హీరోకి తెలియదా..ఈ సినిమా ఎందుకు చేసాడు అని చాలా సార్లు మనం అనుకుంటూంటాం. అయితే పరిస్దితులు వాళ్లను ఆ సినిమా కమిటయ్యేలా చేస్తాయి. మొహమాటాలు, ఎగ్రిమెంట్స్ వంటివి వర్కవుట్ కాదని తెలిసినా సినిమా చేసేలా చేస్తాయి. మొదట నుంచీ సినిమా ఆడదు అని తెలిసి లేదా భావిస్తూ ఇంట్రస్ట్ లేకుండా చేసిన సినిమాలు అలాగే భాక్సాఫీస్ వద్ద చీదేస్తూంటాయి. ఇప్పుడు రవితేజ పరిస్దితి కూడా అలాగే ఉందిట. ఆయనకు ఇష్టంలేకపోయినా ఓ చిత్రం చేయాల్సివస్తోందిట. ఆ విషయం నిర్మాతలకు తెలిసినా ముందుకు వెళ్లిపోతున్నారట. అదేంటో చూద్దాం. 

గతంలో అంటే పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా సినిమా లు చేస్తున్న టైమ్ లో తమిళంలో విజయవంతమైన ‘తెరి’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధినేతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సివిఎం(మోహన్‌). ఈ సినిమాను కందిరీగ ఫేమ్ సంతోశ్ శ్రీనివాస్ డైరెక్టర్ చేయడానికి కూడా సిద్ధమైపోయాడు. రకరకాల మార్పులతో  స్క్రిప్ట్ అంతా రెడీ చేసేసుకున్నాడు. కానీ పవన్ రాజకీయాల్లో బిజీగా మారిపోవడంతో.. ఆయనతో సినిమా చేసేందుకు లేకుండా పోయింది. దాంతో అదే సినిమాను రవితేజతో చేయాలనుకుంటున్నారు ఈ సంస్థవారు. అందుకు సంబంధించిన రంగం సిద్ధమైంది. 

రవితేజ ఇమేజ్‌కు తగ్గట్లుగా స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేశారు. సినిమా మొదలుపెట్టడానికి సన్నాహాలు చేశారు. కానీ ఆల్రెడీ తెలుగులో దిల్ రాజు వంటి నిర్మాత డబ్ చేస్తేనే వర్కవుట్ కాని సినిమా. అసలేమాత్రం కొత్తదనం లేని ‘తెరి’ సినిమా తెలుగులో ఆడదన్న అభిప్రాయాలు అంతటా వినిపించాయి. దానికి తోడు అప్పటికే మాస్ మహా రాజా వరుసగా రొటీన్ మాస్ సినిమాలు చేసి చతికిలపడి ఉన్నాడు.   దీంతో ఈ చిత్రాన్ని ఆపేయడం మేలన్న నిర్ణయాని వచ్చేసి ఆపేసారు. 

రవితేజ కూడా తన పనిలో పడి ‘డిస్కో రాజా’ సినిమా ఓకే చేసి షూటింగ్ కు రెడీ అయిపోయాడు. కానీ మైత్రీమూవీస్ వాళ్లకు మాత్రం సినిమా ఆడుతుందని నమ్మకం ఉందో ఏమో కానీ...మేము చాలా డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టి రీమేక్ హక్కులు కొన్నాం.. స్క్రిప్టు మీద వర్క్ చేశాం కాబట్టి ఈ చిత్రాన్ని తీయాల్సిందే అని డిసైడ్ అయ్యారట.

దాంతో తక్కువ బడ్జెట్ లో , తక్కువ రోజుల్లో సినిమా చేసేద్దాం అంటూ రవితేజ ని ఒప్పించి... కూడా ఈ సినిమాని ముందుకు తీసుకువెళ్తున్నారట. రవితేజ అటు అడ్వాన్స్ తీసుకున్నందుకు కాదనలేక..అలాగని ఆడుతుందో ఆడదో తెలియని సినిమాని చేయలేక గిలగిల్లాడుతున్నాడట. ‘డిస్కో రాజా’తో పాటే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 

ఏప్రిల్‌లో సినిమాను స్టార్ట్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ సినిమాలో క్యాథరిన్ హీరోయిన్‌గా నటించ‌నుంది. కాగా.. సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేసేలా ప్లాన్స్ చేస్తున్నారు. కందిరీగ ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ సినిమాను తెర‌కెక్కించ‌నున్నాడు.