ఛలో చిత్రంతో తెలుగుకు పరిచయం అయినా విజయ్ దేవరకొండతో చేసిన 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది రష్మిక మందన్న.  ఆ తర్వాత  తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో చేసింది. సినిమా వర్కవుట్ కాకపోయినా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపధ్యంలో ... రష్మిక ప్రస్తుతం మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు'లో చేస్తోంది.  అలా అతి తక్కువ కాలంలో తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది రష్మిక మందన్న. ఇప్పుడు ఈమెకు మరొక గోల్డెన్ ఛాన్స్ దక్కిందని టాక్. అది కూడా హిందీ పరిశ్రమ నుంచి  కావడంతో ఆమె మేఘాల్లోతేలుతోందని టాక్.

వివరాల్లోకి వెళితే...తెలుగులో నాని నటించిన  హిట్ చిత్రం ‘జెర్సీ’ని హిందీలోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాతకరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. అతనికి జోడీగా రష్మిక మందన్నను తీసుకుంటే బాగుంటుందని కరణ్ జోహార్ భావించి ఆమెను సంప్రదించినట్లు టాక్. దాదాపు ఆమెనే ఖాయం చేసినట్టు తెలుస్తోంది. కరుణ్ జోహార్ రీసెంట్ గా డియర్ కామ్రేడ్ లో ఆమె నటన చూసి ఫిధా అయ్యి ఈ ఆఫర్ ఇచ్చినట్లు చెప్తున్నారు. 

 షాహిద్ కపూర్ గత చిత్రం ‘కబీర్ సింగ్’ భారీ హిట్ కావడంతో ‘జెర్సీ’ హిందీ రీమేక్  భారీగానే చేయనున్నారు. ఆ స్దాయి సినిమాతో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం రావడం నిజంగా రష్మికకు అదృష్టం అంటోంది మీడియా. 

 ధర్మ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ సినిమాను రీమేక్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.  అయితే ‘కబీర్‌ సింగ్’ విజయంతో జోరు మీదున్న షాహిద్‌ ‘జెర్సీ’ రీమేక్‌లో నటించేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.40 కోట్లు డిమాండ్‌ చేసినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. షాహిద్‌ ఇందుకు అర్హుడేనని భావించిన కరణ్‌ కూడా ఆయన అడిగినంత  రెమ్యునేషన్ ఇవ్వడానికి ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌లో తెలుగు సినిమా రీమేక్‌లకు ఆదరణ రోజురోజుకీ పెరిగిపోతోంది. ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్‌గా వచ్చిన ‘కబీర్‌ సింగ్‌’ దాదాపు రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టింది. మరోపక్క విజయ్‌ దేవరకొండ నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాను రీమేక్‌ చేస్తానని కరణ్‌ జోహార్‌ ప్రకటించారు. ఇప్పుడు ‘జెర్సీ’, ‘ఓ బేబీ’ సినిమాల రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి.