ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుఢ్‌లో హాట్‌ కేక్‌లా మారిన రష్మిక మందన్నా కన్నడ భాషకి చెందిన నటి అన్న విషయం తెలిసిందే. కన్నలో రక్షిత్‌ శెట్టి హీరోగా రూపొందిన `కిరిక్‌పార్టీ` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా విజయంతో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు ఈ బ్యూటీకి. అంతేకాదు ఈ సినిమా హీరో రక్షిత్‌ శెట్టితోనే ప్రేమలో పడింది. నిశ్చితార్థం వరకు కూడా వెళ్లింది. కానీ తెలుగులోకి `ఛలో` చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి క్రేజీ ఆఫర్స్ ని దక్కించుకుంటుంది. హీరోయిన్‌గా భారీ అవకాశాలు వస్తానయో ఏమో మొత్తానికి రక్షిత్‌ మ్యారేజ్‌ని క్యాన్సిల్‌ చేసుకుంది. 

ఇదిలా తాజాగా సోమవారం తన 25వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది రష్మిక మందన్నా. ఈ సందర్బంగా ఆమె మాజీ ప్రియుడు రక్షిత్‌ శెట్టి రష్మికకి సంబంధించిన ఓ అరుదైన వీడియోని పంచుకుంటూ బర్త్ డే విషెస్‌ తెలిపారు. ఇది ఆమె `కిరిక్‌ పార్టీ` కోసం ఇచ్చిన మొదటి ఆడిషన్‌. ఈ వీడియో పంచుకుంటూ, `కిరిక్‌ పార్టీ` ఆడిషన్‌లోని మధురానుభూతులను షేర్‌ చేస్తున్నాను. అప్పటి నుంచి నీ ప్రయాణం ఎంతో సాహసోపేతంగా సాగింది. రియల్ వారియర్‌లా నీ కలలను చేధించుకుంటూ వెళ్తున్నావు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే. నువ్వు మరెన్నో విజయాలు సాధించాలి` అని రాసుకొచ్చాడు.

ఇది చూసిన రష్మిక స్పందిస్తూ, `అప్పటి క్షణాలు నాకింకా గుర్తున్నాయి. థ్యాంక్‌ యూ సో మచ్` అని బదులిచ్చింది. ఇక ఈ వీడియోలో కళ్లజోడు పెట్టుకున్న రష్మిక పేపర్‌లో ఉన్న డైలాగ్స్‌ నేర్చుకుంటూ అప్పజెబుతోంది. అలాగే అక్కడున్న వారితో కాస్త సీరియస్‌గా, కాస్త నవ్వుతూ మాట్లాడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే రష్మిక బర్త్‌డేను పురస్కరించుకుని 'పుష్ప', 'ఆడాళ్లు మీకు జోహార్లు' సినిమాలు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ హీరోయిన్‌ మాత్రం తన బర్త్‌డే రోజు కూడా షూటింగ్‌లో పాల్గొనడం గమనార్హం. ప్రస్తుతం ఆవిడ అమితాబ్‌ బచ్చన్‌ 'గుడ్‌బై' సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉంది. హిందీలో `మిషన్‌ మజ్ను`, `గుడ్‌బై` చిత్రాల్లో నటిస్తుంది.