టాలీవుడ్ లో 'గీత గోవిందం' చిత్రంతో పాపులారిటీ దక్కించుకున్న నటి రష్మిక తన నిశ్చితార్దాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ కన్నడ నటుడు రక్షిత్ శెట్టిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆమె పెళ్లిని క్యాన్సిల్ చేయడంపై పలు రకాల కథనాలు వినిపించాయి. ఈ విషయంపై నటుడు రక్షిత్.. రష్మికని టార్గెట్ చేయొద్దని, ఆమెని ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ పోస్ట్ పెట్టాడు.

ఇప్పుడు ఈ విషయాలపై రష్మిక కూడా స్పందించింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై ఎవరికీ ఎలాంటి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని అంటోంది. ''ఇంతకాలం నా వ్యక్తిగత విషయాలపై మౌనం వహించినందుకు క్షమించండి. నా గురించి ఎన్నో కథలు, వార్తలు, కామెంట్లు, ట్రోల్స్ వస్తున్నాయి. అవన్నీ నన్ను తప్పుగా చూపిస్తుండడంతో నేను బాగా డిస్టర్బ్ అయ్యాను. ఈ విషయాలన్నీ చాలా దూరం వెళ్లిపోయాయి.

ఇందుకు మిమ్మల్ని వేలెత్తి చూపాలనుకోవడం లేదు. ఎందుకంటే మీరు అలాంటివే నమ్ముతారు. ఈ వార్తల గురించి మీ అందరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. కానీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను, రక్షిత్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీకి చెందిన ఏ ఒక్కరూ మాలాగా ఇబ్బందులు పడకూడదు.

ఒక నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్లు ప్రతి కథకు రెండు రూపాలు ఉంటాయి. దయచేసి మా పనిని ప్రశాంతంగా చేసుకోనివ్వండి. భాష ఏదైనా నేను నటిస్తూనే ఉంటాను.. ఈ ఇండస్ట్రీలోనే ఉంటాను'' అంటూ చెప్పుకొచ్చింది.