వరుణ్ తేజ్ సరసన ‘తొలి ప్రేమ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మరింత ఫాలోయింగ్ సంపాదించింది బబ్లీ బ్యూటీ.. సారీ స్లిమ్ బ్యూటీ రాశి ఖన్నా. బబ్లీగా.. గ్లామరస్ గా కనిపిస్తూ మసాలా సినిమాలు చేసుకుంటూ సాగిపోతున్న రాశిలో ఇంత టాలెంట్ ఉందని ‘తొలి ప్రేమ’తోనే తెలిసింది. ఆమె మీద ప్రేక్షకుల దృక్పథమే మారిపోయింది ఈ సినిమాతో. తన కెరీర్లో ‘తొలి ప్రేమ’ ఒక మైలురాయి లాంటి సినిమా అంటున్న రాశి.. ఒక ఇంటర్వ్యూలో తాను అందుకున్న తొలి ప్రేమ లేఖ గురించి పంచుకుంది.
 

రాశి కాలేజీలో చదుకుంటున్న రోజుల్లో ఆమె సీనియర్ ఒకరు ప్రేమ లేఖ రాశాడట. తాను అతడి నుంచి తప్పించుకుని పారిపోదామని చూసినా.. వెంట పడి ప్రేమలేఖ.. రోజా అందించి వెళ్లిపోయాడట. తనకు అతనంటే ఇష్టం లేకపోయినప్పటికీ అతను రాసిన ప్రేమ లేఖ మాత్రం నచ్చిందని రాశి తెలిపింది. బేసిగ్గా తనకు ప్రేమలేఖలు అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పింది. ఆ ప్రేమలేఖను నేరుగా తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చిందట రాశి.
 

రాశి తల్లి అతనంటే నీకిష్టమా అని గుచ్చి గుచ్చి అడిగిందట. ఇష్టమైతే చెప్పమని ప్రేమగా అడిగిందట. కానీ నిజంగా తనకు అతనంటే ఇష్టం లేదని చెప్పేశానని.. తాను తన తల్లి కలిసి ఆ లెటర్ చదువుకుని నవ్వుకున్నామని ఆమె తెలిపింది. తన తల్లి తనతో ఎంత స్నేహంగా ఉంటుందో చెప్పడానికి ఇది రుజువని.. తన తండ్రి కూడా తనతో ఫ్రీగా ఉంటారని.. అలాంటి పేరెంట్స్ ఉండటం తన అదృష్టమని రాశి చెప్పింది.