తన గ్లామర్ తో యూత్ ని కట్టిపడేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత ఇప్పుడు వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తుంది. 'రాజు గారి గది2'లో దెయ్యం పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ 'మహానటి','యూటర్న్' చిత్రాల్లో జర్నలిస్ట్ గా కనిపించి తమ నటనతో మెస్మరైజ్ చేసింది.

ఇప్పుడు మరో వైవిధ్యమైన పాత్రలో నటించడానికి సిద్ధమవుతోంది. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి రూపొందిస్తోన్న ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా ఈ సినిమాను రూపొందించబోతున్నారు.

70ఏళ్ల వృద్ధురాలు.. 20 ఏళ్ల యువతిగా మారడమనే సరికొత్త పాయింట్ తో సినిమా ఉంటుంది. కథ ప్రకారం డెబ్బై ఏళ్ల పాత్రలో కనిపించే సమంతకి ఓ కొడుకు ఉంటాడట. ఆ కొడుకు పాత్ర కోసం రావు రమేష్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. 

కథలో తన పాత్రకి ప్రాముఖ్యత ఉండడంతో రావు రమేష్ కూడా సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. సినిమాలో మెయిన్ హైలైట్ ఇదేనని అంటున్నారు. సమంత, రావు రమేష్ ల మధ్య నడిచే సంభాషణలు ఆకట్టుకునే విధంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ సినిమాకి 'ఓ బేబీ ఎంత సక్కగున్నావే' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.