Asianet News TeluguAsianet News Telugu

రాప్ సంగీతంతో దేశాన్ని ఆకర్షిస్తున్న రణ్వీర్ సింగ్

గల్లీ బాయ్ లాంటి చారిత్రాత్మక విజయంతో ముందుకు దూసుకెళ్తున్న రణ్వీర్ సింగ్, తన సంస్థ ఇంక్ ఇంక్ ద్వారా రాప్ మరియు హిప్ హాప్ కళాకారులకు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాడు. తద్వారా పలు చిత్రాలు, బ్రాండ్లు ఈ కొత్త తరహా సంగీతానికి తగిన ప్రాధాన్యతనిస్తున్నాయి .
 

ranveer sing rap music viral
Author
Hyderabad, First Published Aug 21, 2019, 12:43 PM IST

పలు తరాలుగా బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమ దిగ్గజాలు  సమాజాన్ని ప్రతిబింబిస్తూ వస్తున్న కొత్త సంగీత ప్రక్రియలకు పెద్ద పీట వేస్తూ వచ్చారు. మన దేశం లోని అతి చిన్న గ్రామాల్లో, వీధుల్లో పరిమితమైపోయిన రాప్, హిప్ హాప్ సంగీతాన్ని సినిమా లాంటి మాధ్యమం ద్వారా వ్యాప్తి లోకి తీసుకువచ్చిన ఘనత రణ్వీర్ సింగ్ కి మాత్రమే దక్కుతుంది.

గల్లీ బాయ్ చిత్రం లో రణ్వీర్ సింగ్ అత్యద్భుతమైన నటనను ప్రదర్శించడమే గాక, థియేటర్లలో కాసుల వర్షం కూడా కురిపించాడు. ఇప్పుడు చలనచిత్రేతర సంగీతాన్ని, కళాకారులని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఇంక్  ఇంక్  అనే మ్యూజిక్ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా హిప్ హాప్ కళాకారులైన కామ్ భారీ, స్లో చీతా, స్పిట్ ఫైర్ పరిచయం అవ్వబోతున్నారు. కొద్ది ప్రాంతాలకే పరిమితమైన సంగీత ప్రక్రియను శ్రోతలకు చేరువగా తీసుకెళ్లే ప్రయత్నమే ఇది.

చలన చిత్రాలు, వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీలు సైతం రాప్, హిప్ హాప్ సంగీతాన్ని వారి ప్రచారాల్లో ఉపయోగించుకుంటున్నాయి. ఉదాహరణకు ఇటీవలే జరిగిన లోక్ సభ ఎన్నికల్లలో, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ పై వేలెత్తి చూపడానికి గల్లీ బాయ్ చిత్రంలోని ఆజాది పాటను ఒక ప్రత్యేక సాధనంలా వాడుకుంది. హిమాలయ మెన్స్ ఫేస్ వాష్, రిలాక్సొ ఫ్లయిట్, సబ్కా డెంటిస్ట్ లాంటి ప్రముఖ సంస్థల ప్రచారాలకు కూడా రాప్ సంగీతం మేళవించడం వల్ల జనాల్లో మంచి స్పందనను రాబట్టగలిగారు. ఖాందాని షఫాఖానా  మరియు ఆర్టికల్ 15 సినిమాలలోని కధానేపధ్యంలో రాప్ సంగీతాన్ని చక్కగా జోడించారు. మన దేశంలోని నలుమూల గ్రామాల్లో ఉన్న రాప్ కళాకారుల్ని వెలికి తీయాలనే ఆలోచనతో  ప్రముఖ టీవీ ఛానల్ యమ్ టీ వీ 'హస్సల్' అనే కార్యక్రమం కూడా ప్రారంభించింది.  యూట్యూబ్, ఫేస్బుక్, టిక్ టాక్ లాంటి మాధ్యమాల ద్వారా పలు యువతీ యువకులు రాప్/హిప్ హప్ సంగీతం లో వారి ప్రావీణ్యాన్ని కనబరుస్తున్నారు. 

బహు ప్రజాదరణ పొందుతున్న రాప్ సంగీతం గురించి వివరిస్తూ రణ్వీర్ సింగ్ తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తపరిచారు. "ఆఖరికి హిందుస్తానీ రాప్/ హిప్ హాప్ సంగీతానికి మంచి రోజులొచ్చాయి. ఈ రాప్ ప్రభంజనం సంగీత పరిశ్రమకు అత్యంత శుభ సూచకం, అవసరం కూడా. ఈ యువతరం తన స్వాతంత్ర భావాలని వ్యక్తపరచడానికి రాప్ సంగీతాన్ని ఒక గొప్ప పరికరంలా ఉపయోగించుకుంటుంది. ఎక్కడికెళ్లినా ఇప్పుడు రాప్ సంగీతం యొక్క హవాని చూడగలుగుతున్నాము."

"మన దేశంలోని సంగీతకారులు వారికి వారే సాటి. రాప్/ హిప్ హాప్ కళాకారులు వారి కవిత్వం ద్వారా సంచలనాలు సృష్టిస్తున్నారు. ఈ యువతరం వారి పలుకులనే వేదవాక్కులుగా పరిగణిస్తుంది. వీరి సంగీతమే మన దేశ కంఠ ధ్వని, మన భవిష్యత్తు," అని చెప్పుకొచ్చారు. 

రణ్వీర్ సింగ్ తన దూర దృష్టి, ఆలోచనల ద్వారా దేశాన్ని, హిందీ సినిమా పరిశ్రమని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటానని తెలిపారు. "మన సినిమాలు, పరిశ్రమల పై నాకు అమితమైన ప్రేమాభిమానాలున్నాయి. నేను ఈ సినిమా పరిశ్రమ లో ఒక నాయకుడిగా, మార్గదర్శిగా ఉండదలిచాను. హిందీ సినిమా ఖ్యాతి, పరిశ్రమ లాభాలు ఎల్లప్పుడూ పెరుగుతూ ఉండాలనే  నేను ఆశిస్తాను. ఇది నా చేతుల ద్వారా జరగగలితే నాకు అంతకంటే సంతోషం ఇంకోటి లేదు, ఉండబోదు," అని కొనియాడారు.

Follow Us:
Download App:
  • android
  • ios