ఇండియన్ క్రికెట్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. తాజాగా ఆయన బయోపిక్ రాబోతుంది. ఇందులో రణ్ బీర్ కపూర్ నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా దీనిపై హీరో స్పందించారు.
మ్యాచ్ ఫిక్సింగ్ లో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్న ఇండియన్ క్రికెట్ టీమ్‌ని సరైన దారిలో పెట్టి, అంతర్జాతీయంగా బలమైన జట్టుగా నిలబెట్టడంలో కీలక భూమిక పోషించారు సౌరభ్ గంగూలీ. కెప్టెన్‌గా టీమిండియాకి ఆయన విశేష సేవలందించారు. ఆయన్ని క్రికెట్‌కి సంబంధించిన సూపర్ హీరోగా భావిస్తుంటారు అభిమానులు. `దాదా`గా అభిమానులు పిలుచుకునే గంగూలీ జీవితంపై త్వరలో సినిమా రాబోతుంది. అందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి.
అయితే గంగూలీ పాత్రలో బాలీవుడ్ ఛాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ నటించబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఆ పాత్రకి ఆయన బాగా సెట్ అవుతాడని, అందుకు రణ్ బీర్ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త చక్కర్లు కొట్టింది. రణ్‌బీర్ డేట్స్ కూడా ఇచ్చారని, గంగూలీ గురించి తెలుసుకునేందుకు దర్శకుడితో కలిసి త్వరలోనే కోల్ కతాకు వెళ్తున్నారని చెప్పారు. హీరో రణ్‌బీర్ కపూర్ తో పాటు దర్శకుడు కోల్కతా వెళ్లి క్యాబ్, ఈడెన్ గార్డెన్స్ మైదానం, గంగూలి ఇంటిని సందర్శించబోతున్నారట. అంతేకాదు ఇక గంగూలి కెరీర్ లో జరిగిన ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా తెలుసుకొని ఇక కథలో చేర్చబోతున్నారని టాక్.
దీనిపై గంగూలీ భార్య డోనా గంగూలీ కూడా స్పందించింది. బయోపిక్ గురించి ఆ దర్శక నిర్మాతలనే అడగాలని తెలిపింది. `నా ఫేవరెట్స్ గురించి తెలుసుకోవాలంటే అమితాబ్ బచ్చన్ లేదంటే షారుక్ ఖాన్ అంటాను. కానీ వయసు రీత్యా వాళ్లు ఈ సినిమాకు సరిపడరు. 24 ఏళ్ల గంగూలీలా కూడా కనిపించాలి. సినిమా చాలా వరకూ ఈ వయసులో ఉన్న గంగూలీ చుట్టే తిరుగుతుంది. అందువల్ల ఆ వయసుకు తగిన నటుడిని ఎంపిక చేయడం మంచిది` అని ఆమె వెల్లడించింది.
ఇదిలా ఉంటే తాజాగా దీనిపై రణ్‌బీర్ కపూర్ స్పందించారు. తాను ఈ బయోపిక్‌లో చేయడం లేదని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో రణ్ బీర్ రియాక్ట్ అవుతూ, `దాదా లివింగ్ లెజెండ్. ఆయనకు ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. ఆయన బయోపిక్ తీస్తే బాగుంటుంది. దాన్ని నేను ఇష్టపడతాను. కానీ ఆ సినిమాలో నేను నటిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారం నిజం కాదు. నన్ను ఇంత వరకు ఎవరూ స్పందించలేదు. దీనిపై నాకు ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నట్లున్నాయి` అని రణబీర్ వెల్లడించారు.
అయితే ప్రస్తుతం తాను లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్ బయోపిక్‌పై వర్క్ చేస్తున్నట్టు తెలిపారు. నెక్ట్స్ సినిమాగా అది ఉండబోతుందన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే రణ్ బీర్ `సంజయ్ దత్ బయోపిక్‌లో నటించారు. మరోవైపు ఇండియన్ క్రికెట్‌లో ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్ బయోపిక్‌లు వచ్చాయి. అందులో `ధోనీ` చిత్రం సంచలన విజయం సాధించింది. కపిల్ దేవ్ బయోపిక్ `83` ఆశించినంత ఆదరణ దక్కలేదు. సచిన్ డాక్యుమెంటరీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మరి గంగూలీ బయోపిక్ ఎలా ఉండబోతుందో చూడాలి.
