ఎట్టకేలకు విరాటపర్వం చిత్రం థియేటర్స్ లోకి తీసుకువచ్చేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. తాజాగా అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించారు.
వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'నీది నాది ఒకే కథ' చిత్రంతో వేణు ఊడుగుల విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. దీనితో విరాటపర్వం కథని చాలా బలంగా రాసుకున్నారు. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రానా ఎంచుకున్న మరో ప్రయోగాత్మక చిత్రం ఇది. చాలా రోజుల క్రితం విడుదలైన టీజర్ అదరగొట్టింది.
సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా రోజుల క్రితమే షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక రిలీజ్ కు రెడీ అవుతుండగా ఏదో ఒక అడ్డంకులు ఈ చిత్రానికి ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కరోనా వల్ల చాలా కాలం ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. కరోనా తగ్గుముఖం పట్టక రిలీజ్ కి మంచి సమయం కుదర్లేదు.
ఇక ఎట్టకేలకు విరాటపర్వం చిత్రం థియేటర్స్ లోకి తీసుకువచ్చేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. తాజాగా అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించారు. జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ రానా, సాయి పల్లవి ఉన్న పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సాయి పల్లవి కుంకుమ రంగు లంగా ఓణీలో కనిపిస్తుండగా.. రానా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. రానా చివరగా భీమ్లా నాయక్ చిత్రంతో హిట్ కొట్టాడు. ఇప్పుడు సోలోగా విజయ ఢంకా మోగించేందుకు విరాట పర్వంతో రెడీ అవుతున్నాడు.
ఈ చిత్రం నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ లవ్ స్టోరీ. ఈ చిత్రానికి ట్రాజిడీ ఎండింగ్ ఉండబోతోంది అంటూ కథ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నందిత దాస్, ప్రియమణి, నివేత పేతురేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నక్సలైట్ గా రానా ఎలా నటించాడు అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. సాలిడ్ రోల్ పడితే విశ్వరూపం ప్రదర్శించే రానా.. ఈ చిత్రంలో కూడా అదరగొట్టి ఉంటాడని భావిస్తున్నారు.
