టబు తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే కాని అందరికీ గుర్తుండిపోయారామె.  నాగార్జునతో ఆమె చేసిన నిన్నే పెళ్లాడతా ఆమెను ఓ తరానికి ఆరాధ్య దేవతగా మార్చేసింది. ఆ తర్వాత బాలయ్యకి చెన్నకేశవరెడ్డి సినిమాలో తల్లిగా, అందరివాడు సినిమాలో చిరు భార్యగా, తల్లిగా  నటించింది. 

అయితే తెలుగులో ఆమెకు తగ్గ పాత్రలు లేకపోవటంతో గ్యాప్ వచ్చేసింది. రీసెంట్ గా  బన్నీకి తల్లిగా టబును సెలక్ట్ చేసుకున్నారట త్రివిక్రమ్‌.  అంతేకాదు ఇప్పుడు దగ్గుపాటి రానా చిత్రంలోనూ  ఆమె కీలకమైన పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. మానవ హక్కుల కార్యకర్తగా ఆమె బలమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది.  ఆ సినిమా టైటిల్  ‘విరాటపర్వం 1992’. రానా ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించనున్నారు. 

దాదాపు 35 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీలో హీరో పాత్ర కోసం మొదట శర్వానంద్ ను సంప్రదించినప్పటికీ ఈ జోనర్ తనకి సెట్ కాదంటూ శర్వా చేతులెత్తేయడంతో రానాని రంగంలోకి దింపినట్టు సమాచారం.  ఈ సినిమాలో రానా పంచాయితి వార్డ్ మెంబర్ గా కనిపిస్తాడంటున్నారు. 

ఈ చిత్రానికి దర్శకుడు ‘నీది నాది ఒకే కథ’తో పరిచయమైన దర్శకుడు వేణు. తొలి  సినిమాతోనే విమర్శకుల మెప్పు పొందిన ఆయన, ఎమర్జెన్సీ నేపథ్యంలో బలమైన కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అందులో రానా, సాయిపల్లవి జంటగా నటిస్తారు. ప్రజాస్వామ్యం, మార్క్సిజం, మానవ హక్కులు తదితర విషయాల్ని స్పృశిస్తూ సాగే చిత్రమని సమాచారం. డి.సురేష్‌బాబు నిర్మిస్తారు. జులైలో చిత్రం పట్టాలెక్కనుంది. ఇది ఎమర్జెన్సీలో మొదలై, 1992తో ముగిసే కథ అని సమాచారం.   త్రిపురనేని సాయిచంద్‌ కూడా ఓ పాత్రలో నటిస్తారు.  పూర్తి సమాచారం అధికారికంగా త్వరలోనే ప్రకటించబోతున్నారు.