విభిన్న కథా నేపథ్యంతో కూడిన సినిమాలు చేస్తూ నటుడిగా నిరూపించుకున్న రానా పుట్టిన రోజు నేడు. ఈ సోమవారంతో 36వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు మంచి ట్రీట్‌ ఇచ్చింది `విరాటపర్వం` చిత్ర బృందం. వేణు ఉడుగుల దర్శకత్వంలో `విరాటపర్వం` రూపొందుతుంది. సాయిపల్లవి హీరోయిన్‌. నివేథా పేతురాజ్‌, ప్రియమణి, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రానా పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. 

ఇందులో రానా నక్సల్‌గా నటిస్తున్నారు. నక్సల్‌గా ఆయన లుక్‌ ఆకట్టుకుంటుంది. తుపాకి పట్టుకుని నక్సల్‌ డ్రెస్‌లో ఆవేశంగా వస్తున్న రానా లుక్‌ విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పెంచుతుంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా సాగుతుంది. ప్రేమలోనూ ఓ విప్లవం ఉందని, దాని కోపం తిరుగుబాటు చేస్తారనేది ఈ సినిమా కథాంశం. ఓ అన్‌టోల్డ్ స్టోరీని దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించబోతున్నాడు. 

ఇందులో సాయిపల్లవి.. రానాకి జోడిగా, నక్సల్స్ కి భోజనాలు అందించే అమ్మాయిగా, విప్లవ భావాలు కలిగిన అమ్మాయిగా కనిపించనుంది. ప్రియమణి కూడా నక్సల్‌గా కనిపించనుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి మరో ట్రీట్‌ రాబోతుంది. పదకొండుగంటలకు చిన్న వీడియో గ్లింప్స్ ని విడుదల చేయనున్నారు.