`తెలుగు నేల నడిచిన కొత్త దారుల నెత్తుటి జ్ఞాపకం.. మనలోంచి మన కోసం సాగిన ఓ చారిత్రక సందర్భం.. విరాటపర్వం` అని అంటున్నారు హీరో రానా దగ్గుబాటి. ఆయన పుట్టిన రోజు నేడు(సోమవారం). ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న `విరాటపర్వం` చిత్రం టీజర్‌ని ఫస్ట్ గ్లింప్స్ పేరుతో విడుదల చేశారు. తాజాగా ఈ టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. 

ఇందులో అడవిలోని జలపాతాలు, అక్కడ నక్సలైట్‌  చర్చలు, అడవిలో నక్సల్ కర్యాకలాపాలు, ఓ ఊర్లో మంటలు చేలరేగుతుండగా, ఓ పాప పడిపోతే ఆమెని రానా లేపడం, అనంతరం వరుసగా తుపాకులతో దాడులు చేయడం, కమ్యూనిస్ట్ పార్టీ జెండాలతో రావడం వంటి సన్నవేశాలున్నాయి.  `ఈ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది.. సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది.. డాక్టర్‌ రవిశంకర్‌ అలియాస్‌ కామ్రేడ్‌ రవన్న..` చూపించారు. 

అంటే నక్సలైట్‌గా పోరాడిన రవన్న జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందించినట్టు తెలుస్తుంది. ఇందులో రానా రవన్న పాత్రలో కనిపించనున్నారు. 1990లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజా టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇందులో సాయిపల్లవి, ప్రియమణి, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి, సురేష్‌బాబు నిర్మిస్తున్నారు.