బాబాయ్‌, అబ్బాయి వెంకటేష్‌, రానా దగ్గుబాటి కలిసి `రానా నాయుడు` వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ సీజన్‌ 2 ట్రైలర్‌ వచ్చింది.

వెంకటేష్‌, రానా కలిసి నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ `రానా నాయుడు` సీజన్‌ 2. ఇది గతంలో వచ్చిన `రానా నాయుడు` వెబ్‌ సిరీస్‌ కి కొనసాగింపు. వెంకటేష్‌ మొదటి సారి ఇలాంటి భారీ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇది బోల్డ్ గా, ఇంటెన్స్ గా ఉంటుంది. 

ఇందులో వెంకీ పాత్ర గతంలో ఎప్పుడూ చూడని విధంగా కొత్తగా ఉంటుంది. మొదటి భాగంగా టూ బోల్డ్ గా ఉంది. దీంతో విమర్శలు వచ్చాయి. ఫ్యామిలీ సినిమాలతో అలరించే వెంకీ ఇలాంటి సిరీస్‌లో నటించాడేంటి అనే ఆశ్చర్యం వ్యక్తమయ్యింది.

`రానా నాయుడు` సీజన్‌ 2 ట్రైలర్‌

దీంతో ఇప్పుడు సీజన్‌ 2 విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకున్నట్టుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో డైలాగ్‌లు కాస్త నీట్‌గానే ఉన్నాయి. మరీ బోల్డ్ నెస్‌ కనిపించడం లేదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని తెరకెక్కించినట్టు ఉంది. 

ఇక ట్రైలర్‌ ఆద్యంతం ఇంటెన్స్ గా, యాక్షన్‌ ప్రధానంగా సాగుతుంది. ఇదంతా ఫ్యామిలీ గొడవలా కనిపిస్తుంది. ఇందులో రానా.. రానా నాయుడిగా, వెంకటేష్‌ నాగ నాయుడిగా కనిపిస్తున్నారు.

`రానా నాయుడు` మొదటి సీజన్‌ స్టోరీ 

`రానా నాయుడు` సీజ‌న్‌1లో ధ‌న‌వంతులు, దురాశ‌ప‌రులు చేసిన త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చే నైపుణ్య‌మున్న రానా నాయుడు, నేరాల‌ను చెరిపేయ‌గ‌ల‌డు, జీవితాల‌ను తిర‌గ రాయ‌గ‌ల‌డు, భ‌యంకర‌మైన ర‌హ‌స్యాల‌ను ఎవ‌రికీ క‌నిపించ‌కుండా దాచేయ‌గ‌ల‌డు. 

ప్ర‌పంచంలో ఎలాంటి ప‌నినైనా చేయ‌గ‌ల రానా, త‌న తండ్రిని మాత్రం ఎదుర్కోలేడు. రానా నాయుడు తండ్రి నాగ నాయుడు కొడుక్కి దూరంగా ఉంటాడు. ఓ సంద‌ర్భంలో కొడుకు జీవితంలోకి నాగ‌నాయుడు ప్ర‌వేశించాల్సి వ‌స్తుంది. 

ఎవ‌రికీ తెలియ‌ని ఓ గ‌తాన్ని మోసే టైం బాంబ్‌లాంటి వ్య‌క్తి నాగ నాయుడు. నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌రు. ప్రమాద‌క‌ర‌మైన వ్య‌క్తులను, గాయాల‌ను భ‌రిస్తుంటారు. గ‌తంలో జ‌రిగిన త‌ప్పుల‌ను ఫేస్‌ చేస్తుంటారు.

`రానా నాయుడు` సీజన్‌ 2 ట్రైలర్‌ ఎలా ఉందంటే?

ఇక తాజాగా `రానా నాయుడు` సీజ‌న్‌2 ట్రైలర్‌ వచ్చింది. ఇది మరింత ఇంటెన్సిటీతో ఉంది. ఇందులో రానా, నాగ నాయుడు ఎదుర్కొన‌బోయే ప్ర‌మాదం గురించి చూపించారు. పాత గాయాల‌కు ప‌గ తీర్చుకోవాల‌ని గ‌తం కోరుకుంటుంది.

 అందులో భాగంగా రౌఫ్‌ అనే కొత్త శత్రువు ఎంటరవుతాడు. రానాకు స‌మాన‌మైన శ‌త్రువు. త‌న ప‌గ‌ను తీర్చుకోవ‌టానికి ఎలాంటి ప‌నైనా చేయ‌టానికి వెనుకాడడు. రానా చివ‌ర‌గా ఓ ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌నిని ఫిక్స్ చేయాల‌ని భావిస్తాడు. 

ఆ ప్ర‌య‌త్నంలో అత‌ను చివ‌రి వ‌ర‌కు వెళ్తారు. అది సక్సెస్‌ అయితే తన ఫ్యామిలీ బాగుంటుంది. కానీ అప్పుడే రౌఫ్‌ రూపంలో తుఫాన్‌ ఎంటరవుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య యుద్దం మొద‌ల‌వుతుంది. రౌఫ్‌తో పోరాడే క్రమంలో రానా నీరసించిపోతాడు. 

ఈ క్రమంలో నాగ నాయుడు ఎంట్రీ ఇస్తాడు. మరి ఫ్యామిలీ కోసం నాగ నాయుడు ఏంచేశాడు? విలన్‌ని ఎలా ఎదుర్కొన్నాడనేది `రానా నాయుడు` సీజన్‌ 2 లో ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. ట్రైలర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. డ్రామాతోపాటు హై ఓల్టేజ్‌ యాక్షన్ కూడా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండనున్నట్టు తెలుస్తుంది.

YouTube video player

`రానా నాయుడు` సీజన్‌ 2పై దర్శకుడి కామెంట్‌

డైరెక్టర్‌ క‌ర‌ణ్ అన్షుమ‌న్ మాట్లాడుతూ, `రానా నాయుడు` సీజన్2.. సీజన్1 కంటే పెద్ద‌ది. ఇంటెన్స్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. ఎమోష‌న్స్ ఇంకా ఎక్కువ‌గా ఉంటాయి. రానా, నాగ ఇంకా త‌ల‌ప‌డుతూనే ఉంటారు. వీరిద్ద‌రూ గ‌తంతో చేసిన త‌ప్పుల కార‌ణంగా ఇబ్బందులు ప‌డి స్ట్రాంగ్‌గా మారతారు. 

ఈసారి నాయుడు కుటుంబంలోని డ్రామా స‌రికొత్త‌గా ఉండ‌నుంది. కోపాలు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. విశ్వాసాలు క‌నుమ‌రుగ‌వుతాయి. ప్రేమ‌, కుట్ర అనే రెండు అంశాల మ‌ధ్య ఉండే స‌న్న‌ని గీత క‌నిపించ‌కుండా పోనుంది. ప‌రిస్థితులు ఇప్ప‌టికే గంద‌ర‌గోళంగా ఉన్నాయ‌నుకుంటే అర్జున్ రాంపాల్ రాక‌తో ఇవి ఇంకా క‌ఠినంగా మారుతాయి. 

అన్నీ త‌ల‌కింద్రుల‌వుతాయి. అయితే రానా నాయుడు దృష్టంతా ఒక విష‌యంపైనే కేంద్రీకృత‌మై ఉంటుంది. ఏదైమైనా త‌న కుటుంబాన్ని కాపాడుకోవాల‌నేదే అత‌ని ల‌క్ష్యంగా ఉంటుంది` అని తెలిపారు.

`రానా నాయుడు` సీజన్‌ 2 ట్రైలర్‌పై నిర్మాత స్పందన 

నిర్మాత సుంద‌ర్ అరోన్ మాట్లాడుతూ, `రానా నాయుడు` వంటి గమ్మత్తైన, హై ఓల్టేజ్ ప్ర‌పంచంలోకి మ‌ళ్లీ రావ‌టం అనేది ఎంతో ఎగ్జైటింగ్‌ గా ఉంది. గుండె బ‌రువెక్కే భావోద్వేగాల‌తోపాటు, ఎన్నో ట్విస్ట్ లతో కూడిన డ్రామా కూడా ఉంటుంది. 

ఇవ‌న్నీ బాంబ్‌లాగా, ముట్టుకుంటే పేలిపోయేలాంటి క‌థ‌నంతో సీజ‌న్‌2 ఉంటుంది. గొప్ప న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు క‌ల‌యిక‌తో సీజ‌న్‌2ను ప్రేక్ష‌కుల‌ను అందించ‌టం ఎంతో గ‌ర్వంగా ఉంది` అని చెప్పారు.

`రానా నాయుడు` సీజన్‌ 2 రిలీజ్‌ ఎప్పుడంటే

ఇందులో వెంకటేష్‌, రానాతోపాటు అర్జున్‌ రాంపాల్‌, సూర్వీన్ చావ్లా, కృతి ఖర్భందా, సుషాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. క‌ర‌ణ్ అన్షుమ‌న్ క్రియేట్ చేసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో పాటు సుప‌ర్ణ్ వ‌ర్మ‌, అభ‌య్ చోప్రాల‌తో క‌లిసి తెర‌కెక్కించారు. సుంద‌ర్ అరోన్‌, లోకో మోటివ్ గ్లోబ‌ల్ నిర్మాణంలో ఇది రూపొందుతుంది. ఈ సీజన్‌ 2 సిరీస్‌ నెట్‌ ఫ్లిక్స్ లో జూన్‌ 13 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.