భల్లాల దేవుడు రానా దగ్గుబాటి తన తదుపరి చిత్రంలో ట్రావంకోర్ మహారాజు మరట్వాడ వర్మ పాత్రలో కనిపించనున్నారట. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకొన్నారు. ‘అనిజమ్ థిరునాల్ మరట్వాడ వర్మ.. ది కింగ్ ఆఫ్ ట్రావంకోర్' అనే చిత్రంలో నటిస్తున్నాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి అని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి కే.మధు దర్శకుడు. రాబిన్ తిరుమల కథను అందిస్తున్నాడు. సెవెన్ ఆర్ట్స్ మోహన్ ఈ చిత్రానికి నిర్మాత అని మరో ట్వీట్ చేశారు.

 

ది కింగ్ ఆఫ్ ట్రావంకోర్ చిత్రంపై ఓ పక్క దృష్టిపెడుతూనే మరో చారిత్రాత్మక చిత్రం 1945‌లో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సత్య శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం తన గెటప్ మార్చుకోవడం విశేషం. 1945 చిత్రంలో సుభాష్ చంద్ర బోస్ ఏర్పాటు చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్ సేనలో ఓ సైనికుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో రానా సరసన రెజీనా హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రంలో తాను చెట్టినార్ యువతిగా కనిపించనున్నానని ఇటీవల రెజీనా వెల్లడించింది.

 

తెలుగులో 1945 అనే టైటిల్‌తో, తమిళలో తిరంతు అనే పేరుతో విడుదల కానున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ నవంబర్‌లో రానున్నది. ఈ చిత్రంలో సత్యరాజ్, నాజర్, ఆర్‌జే బాలాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కే ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్ఎన్ రాజరాజన్ నిర్మిస్తున్నారు.