త్వరలో దగ్గుపాటి రానా 'ధీరుడు' గా కనిపించి అలరించనున్నారు. కొత్త సబ్జెక్ట్ లు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాయో లేక ఆయనే కొత్త పాయింట్స్ ని ఎంపిక చేసుకుంటున్నాడో కానీ ఆయన చేసే సినిమాలు విభిన్నంగా ఉంటున్నాయి.మరీ ముఖ్యంగా బాహుబలి చిత్రం తర్వాత రానా ఎంపిక లో చాలా మార్పు వచ్చింది. ఆ సినిమాతో ఆయకు వచ్చిన క్రేజ్ అలాంటి,ఇలాంటిది కాదు. ఈ నేపధ్యంలో రానా మరో కొత్త చిత్రం కమిటయ్యారు. గతంలో సిద్దార్దతో గృహం అనే చిత్రం తీసిన మిలింద్ రావు  దర్శకత్వంలో రూపొందనుంది. 

ఇదో హర్రర్ సినిమా. ఈ సినిమాతో రానా ఓ రేంజిలో భయపెట్టనున్నారట. కథ వింటున్నప్పుడే ఆయన భయపడ్డారట. వెంటనే ఓకే చేసేసాడట. ఆ సినిమా టైటిల్ ధీరుడు. ఈ విషయం స్వయంగా రానా వెళ్లడించారు. ఇదో పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ అంటున్నారు. ఈ సినిమా ని సీనియర్ నిర్మాత ఆచంట గోపీనాధ్ నిర్మిస్తున్నారు. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి నిర్మాణం కానుంది. 

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమైంది. మరో పది రోజుల్లో విరాట పర్వం షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా షూట్ కు రెడీ అవుతారు.భారత దేశంలో పురాతన విద్య అయిన చేతబడి చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని తెలుస్తోంది. మరో ప్రక్క రానా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.  ఇప్పటికే రానా చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. 'హాథీ మేరె సాథీ'.. '1945' లతో పాటుగా 'విరాటపర్వం' షూటింగ్ దశలో ఉన్నాయి. 

అలాగే 'అరణ్య' సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్ర నిర్మాతలు థియేటర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే కాకుండా గుణశేఖర్‌ డైరెక్ట్ చేస్తున్న 'హిరణ్యకశ్యప' అనే ప్రాజెక్ట్‌లో కూడా రానా నటిస్తున్నాడు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.