టాలీవుడ్ లో తెరకెక్కుతున్న అతిపెద్ద మల్టీస్టారర్స్ లో అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ ఒకటి. పవన్ కళ్యాణ్ మరియు దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న ఈ మూవీ ప్రకటనతోనే అంచనాలు పెంచేసింది. మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ హక్కులు దక్కించుకున్న నిర్మాత సూర్య దేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. పవన్ కళ్యాణ్ పై ఫైట్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. బుల్లెట్ పై వెళుతున్న పవన్ కళ్యాణ్ వీడియో గ్లిమ్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. 

కాగా నేడు అయ్యప్పనుమ్ కోశియుమ్ మూవీ నుండి రానా లుక్ విడుదల చేశారు. బ్లూ సపారీలో మీసం తిప్పుతూ రానా లుక్ ఫెరోషియస్ గా ఉంది. అయ్యప్పనుమ్ కోశియుమ్ మూవీ పోలీసు అధికారికి, ఆర్మీ అధికారికి మధ్య జరిగే ఆధిపత్య పోరు.  తెలుగు రీమేక్ లో పవన్ మరియు రానా ఆ పాత్రలు చేస్తుండగా... ప్రత్యర్థులుగా కనిపించనున్నారు. 


ప్రముఖ నటులు సముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఈ చిత్రంలో కీలక రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. యువ దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మరియు మాటలు అందిస్తున్నారు.  సంగీత దర్శకుడు థమన్.ఎస్ ఈ చిత్రానికి సమకూరుస్తున్నారు.  అలాగే సమున్నత ప్రతిభావంతులైన 'ప్రసాద్ మూరెళ్ళ' ఛాయాగ్రాహకునిగా,ఎడిటర్ గా 'నవీన్ నూలి', కళా దర్శకునిగా 'ఏ.ఎస్.ప్రకాష్ లు  ఇప్పటివరకు ఎంపిక అయ్యారు అని తెలిపారు. ఇక  ఈ చిత్రంలోని ఇతర నటీ,నటులు సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియ పరుస్తామన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ చిత్రానికి సమర్పకులు గా పి.డి.వి. ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.