ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ గా పేరొందిన దీపికా పదుకొనె రణ్‌ వీర్ సింగ్ జోడి మొత్తానికి శుభవార్తను తెలిపింది. గత కొన్నేళ్ళుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట పెళ్లితో ఒకటవనున్నట్లు అధికారిక ప్రకటనను జారీ చేసింది. సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ గా మారింది. 

దీపిక ఎంతో సంతోషంగా అభిమానులతో ఈ విషయాన్నీ షేర్ చేసుకుంది. నవంబర్ 14-15 తేదీల్లో పెళ్లి వేడుక జరుగనున్నట్లు తెలిపారు. దీపిక చేసిన ట్వీట్ ను రణ్‌వీర్ కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీపిక, రణ్‌వీర్ కలిసి రామ్‌లీలా - బాజీరావ్‌ మస్తానీ - పద్మావత్‌ వంటి బాక్స్ ఆఫీస్ చిత్రాల్లో నటించారు. 

వీరిద్దరూ లవ్ లో ఉన్నట్లు బయటకి ఎప్పుడు చెప్పుకోలేదు. ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా పట్టించుకోలేదు. ఇక ఒక ఇంటర్వ్యూలో దీపికా మాత్రం పెళ్లి ఫిక్స్ అయితే చెబుతామని హింట్ ఇవ్వడం తప్పితే ఏనాడూ బహిర్గతం చేసుకోలేదు. ఇక ఫైనల్ గా నేడు పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పేశారు. 

అయితే పెళ్లి ఎక్కడ జరగనుందనే విషయాన్నీ దీపిక తెలుపలేదు. బాలీవుడ్ లో వినిపిస్తోన్న కథనాల ప్రకారం ఇటలీలో ఈ జోడి పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.