అజ్ఞాతవాసిని చూసి నేర్చుకున్నానంటున్న రామ్ గోపాల్ వర్మ

First Published 2, Jan 2018, 5:47 PM IST
ramgopal varma says he is inspired by agnyaatha vaasi
Highlights
  • గత కొంత కాలంగా సోషల్ మీడియా పేజ్ ట్విటర్ లో అజ్ఞాతంగా వున్న వర్మ
  • నూతన సంవత్సరం సందర్భంగా మళ్లీ ట్విటర్ లో దుకాణం తెరిచిన వర్మ
  • అజ్ఞాతవాసిని చూసి నేర్చుకున్నానంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్

వర్మ ట్వీట్ చేస్తే మాస్.. వర్మ పోస్ట్ పెడితే మాస్... ఏడు నెలల క్రితం వరకు రామ్ గోపాల్ వర్మ తన ట్విటర్ వేదికగా చేసిన పోస్ట్ లు, కామెంట్లు ప్రతీది ఓ సంచలనం. వర్మ ఒకప్పుడు ట్విట్టర్ వేదికగా అనేక వివాదాలకు తెరలేపారు. తనకు నచ్చని ప్రతి అంశంపై, ప్రతి వ్యక్తిపై పక్షపాతం లేకుండా తనకు ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు చేసేవాడు. అలా అనేక మంది ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆయనపై కొన్ని కేసులు కూడా నమోదైన సంగతి తెలిసిందే. వంగవీటి సినిమా నేపథ్యంలో పబ్లిగ్గా ఇక ట్విటర్ కు గుడ్ బై అని చెప్పటంతో వర్మ ట్విటర్ ఎకౌంట్ గత 7 నెలలుగా మూగబోయింది. మే 27, 2017న చివరి ట్వీట్ చేసిన వర్మ తర్వాత దాన్ని మూసివేశారు.

 

అయితే తాజాగా నూతన సంవత్సరం ప్రారంభం అయిన వేళ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ అజ్ఞాతవాసం వీడారు. జనవరి 2న ట్విట్టర్లో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ ఖాతా రీ ఓపెన్ చేశారు. దీనిపై స్పందిస్తూ... పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'తో స్పూర్తిని పొంది మళ్లీ ట్విట్టర్లోకి వచ్చానని పేర్కొన్నారు.

 

ఇక వర్మ పునఃప్రారంభించిన ట్వీట్స్ లో... సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై కూడా వర్మ అభిప్రాయం పోస్ట్ చేశారు. రాజకీయ ప్రవేశాన్ని ప్రకటిస్తున్న వేళ రజనీలో కనిపించిన పవర్ ను తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని అన్నారు. తమిళనాడులో ప్రతి ఒక్కరూ రజనీకే ఓటు వేస్తారని చెప్పారు. అతనికి పోటీగా నిలబడటం ఏ రాజకీయ పార్టీకైనా కష్టమేనని అన్నారు.

 

గతంలో వర్మ చేసిన ట్వీట్స్ అన్నీ ఓడ్కా తాగిన మత్తులో చేస్తారనే విమర్శ ఉంది. అయితే తాను ఇప్పుడు వోడ్కా మానేశానని, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నానని వర్మ ఓ అభిమాని ట్వీట్ కు రిప్లై ఇసస్తూ పేర్కొన్నారు.

 

అప్పట్లో రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ఖాతా మూసి వేయడానికి మెగా వివాదమే అనే వాదన ఉంది. ఆ రోజుల్లో ఆయన మెగాస్టార్ మీద, పవన్ కళ్యాణ్ మీద, నాగబాబు మీద చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. దీంతో వర్మను నాగబాబు ‘అక్కు పక్షి' అంటూ సంబోధిస్తూ మండి పడ్డారు. ‘అక్కు పక్షి' అనే పదాన్ని మెగా అభిమానులు ట్విట్టర్లో వైరల్ చేశారు. ఆ తర్వాత వివాదం మరింత ముదరడం వల్లనే వర్మ అప్పుడు ట్విట్టర్ ఖాతా మూశారని అంటుంటారు. పవన్ కళ్యాణ్ మూవీ స్పూర్తితో తాను మళ్లీ ట్విట్టర్ ఖాతా తెరుస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించడం తాజాగా చర్చనీయాంశం అయింది.

 

loader