శివ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వినూత్నమైన టేకింగ్ తో.. ఒక కొత్త ఒరవడితో తెరకెక్కించిన శివ సినిమా ప్రేక్షకులు మరవలేని రీతిలో తెరకెక్కించాడు  వర్మ. నాగార్జున హీరోగా నటించిన శివ చిత్రం ఇప్పటికీ చూస్తుంటే.. అంతే ఇంటెన్సిటీతో కనిపిస్తుంది.

 

ఇక శివ తర్వాత రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్నో సినిమాలు చేస్తూ.. తనదైన కమెంట్స్ తో సోషల్ మీడియాలో సంచలన దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. వర్మ తీసిన రక్తచరిత్ర, వంగవీటి లాంటి బయోపిక్స్ తో తెలుగు సినిమా కొత్త పంథాలోకి వెళ్లింది. తాజాగా వర్మ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కూడా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

మరోవైపు కింగ్ నాగార్జునకు కూడా.. వర్మ ఓ ఆసక్తికరమైన కథ వినిపించాడట. దానికి తాను కూడా చాలా ఎగ్జయిటయ్యానని స్వయంగా నాగార్జున తెలిపారు. అయితే మరొకసారి అదే తీవ్రతతో స్టోరీ చెప్పాలని.. సమంత,నాగచైతన్యల వివాహం తర్వాత మళ్లీ కలుద్దామని వర్మతో చెప్పానని నాగార్జున తెలిపారు.

 

ఈనేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే విషయాన్ని కన్ఫమ్ చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. 25ఏళ్ల తర్వాత నాగార్జునతో మళ్లీ సినిమా చేయబోతున్నానని, శివ లానే దీన్ని కూడా సక్సెస్ ఫుల్ చిత్రంగా తెరకెక్కిస్తాననే నమ్మకంతో వున్నానని వర్మ తెలిపారు.