సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించనున్న వర్మ పూర్తిగా లక్ష్మీపార్వతి కోణంలోనే సినిమా అనటంతో వివాదాస్పదంగా మారిన చిత్రం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత ముఖ్యమంత్రి, మహానటుడు నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించనున్న సినిమాకు సంబంధించి, టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్ ఖరారు చేయడంతో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వర్మ.. తాజాగా ఈ చిత్ర నిర్మాత‌ను కూడా ఫైనల్ చేశాడు.

వర్మ తెరకెక్కించబోయే చిత్రాన్ని వై.ఎస్.అర్.సి.పి నేత పి.రాకేష్ రెడ్డి నిర్మించబోతున్నారని అఫీషియల్‌గా ప్రకటించారు. “మా ఇద్దరి ఆంతరంగిక అభిమతం ఈ చిత్రాన్ని పాలిటిక్స్ కి అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తియ్యాలని”అంటూ ఆర్జీవీ స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఆయన్ను వెన్నుపోటు పొడిచింది ఎవరు అనే అంశాలు ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వైసీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశం అయింది. ఈ సినిమా పూర్తిగా లక్ష్మీ పార్వతి కోణంలో ఉండబోతోంది. లక్ష్మీ పార్వతి ఇప్పటికే వైసీపీ పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఇపుడు ఈ సినిమా నిర్మాత కూడా వైసీపీ నేత కావడంతో.. సినిమా పూర్తిగా ఆమె కోణంలో, ఆమెకు అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.

లక్ష్మీ పార్వతి కోణంలో సినిమా ఉంటే.. ఈ సినిమాలో విలన్ గా చంద్రబాబును చూపించే అవకాశం వుందనేది తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే జరిగితే సినిమా అత్యంత వివాదాస్పద చిత్రం కావడం ఖాయం. అత్యంత నిజమైన మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన శత్రువులు ఎవరో? నమ్మక ద్రోహులెవరో? ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలు ఏమిటో అన్నీ అశేషతెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ఎన్టీఆర్ చిత్రంలో చూపిస్తాను అని వర్మ ఇప్పటికే ప్రకటించారు. తమ సినిమా విషయంలో తనను టార్గెట్ చేసిన వారికి వర్మ ఘాటుగా సమాధానం ఇచ్చారు.