Asianet News TeluguAsianet News Telugu

బోడి సారీ మాకెందుకు.. వర్మకు శిక్ష పడాల్సిందే

  • జీఎస్టీ వెబ్ సిరీస్ నేపథ్యంలో వర్మపై కేసు
  • సీసీఎస్ లో విచారణకు హాజరైన వర్మ
  • జీఎస్టీ నేను తీయలేదని పోలీసులకు చెప్పిన వర్మ
  • దోషిగా తేలితే వర్మకు ఏడేళ్ల శిక్షపడే అవకాశముందన్న అడిషనల్ డీసీపీ రఘువీర్
ramgopal varma gst case becoming strong day by day

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) వెబ్‌ సిరీస్ నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సామాజిక కార్యకర్తలు దేవీ, మణిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం వర్మను పోలీసులు విచారించారు. సుమారు నాలుగు గంటల విచారణ తర్వాత వర్మ ల్యాప్‌టాప్ సీజ్ చేసినట్టు సీసీఎస్ అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు. 

 

అశ్లీలత, మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మపై నమోదైన కేసు సాధారణమైంది కాదని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. డీసీపీ రఘువీర్ మాట్లాడుతూ.. ఐపీసీ 506, 509 సెక్షన్ల ప్రకారం కేసు బుక్ చేశాం. అడిగిన ప్రశ్నలకు వర్మ సమాధానం ఇచ్చారు. జీఎస్‌టీ సినిమాను ప్రొడ్యూస్ చేయలేదని వర్మ చెప్పారు. కేవలం డైరెక్షన్ మాత్రమే చేశానన్నారు. అది కూడా స్కైప్‌ ద్వారానే చేశానన్నారు. వర్మ స్కైప్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కలెక్ట్ చేశాం. స్కైప్ నుంచి వివరాలు సేకరిస్తాం. వర్మ ల్యాప్ ట్యాప్‌ను ఎఫ్ఎస్ఎల్‌కు పంపిస్తాం. పోలెండ్‌, బ్రిటన్‌లో జీఎస్టీ చిత్రీకరణ జరిగిందని వర్మ చెప్పాడు, ఆయా దేశాలకు వర్మ వెళ్లడంపైనా విచారణ చేస్తున్నాం. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు వర్మ సమయం కోరాడు. వచ్చేవారం విచారణకు హాజరుకావాలని కోరాం అని డీసీపీ తెలిపారు.

 

మహిళా సంఘం నేతలు దేవీ, మణికి రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు చెప్పారు. జీఎస్టీ సినిమా వివాదంపై డిబేట్‌లో భాగంగా రామ్ గోపాల్ వర్మ వాళ్లను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీవీ చానెల్ డిబేట్ సందర్భంగా తమను అవమానించే విధంగా మాట్లాడాడు. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఎమోషనల్‌‌లో భాగంగానే అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని.. అందుకు తాను సారీ చెబుతున్నానని.. వారంటే తనకు అపారమైన గౌరవం ఉంది అని వర్మ చెప్పారు.

 

అయితే వర్మ క్షమాపణలను ఐద్వా నేత మణి స్వీకరించలేదు. తనను రాంగోపాల్ వర్మ దారుణంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి చిత్రంలో తనను పెట్టి సినిమా తీస్తానని వర్మ చాలా దిగజారి మాట్లాడారు. ఆయన చెప్పిన సారీ నేను అంగీకరించడం లేదు. ఆయనకి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందేనని అని మణి తేల్చి చెప్పారు. ఆడవాళ్లని అవమానించిన వారికి ఏ శిక్ష పడుతుందో అదే శిక్ష వర్మకు పడాలని మణి కోరుతున్నారు.

 

మణి క్షమాపణలు స్వీకరించని అంశంపై కూడా వర్మ స్పందించారు. కేసును ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని ఓ ఛానల్ నిర్వహించిన డిబేట్‌లో వర్మ తెలిపారు. ఇదిలా వుండగా.. అశ్లీలత, మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మపై నమోదైన కేసు సాధారణమైంది కాదని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఈ వ్యవహారంలో వర్మ దోషిగా తేలితే ఏడేళ్లవరకు శిక్ష పడే అవకాశం ఉందని, గతంలో కూడా ఇటువంటి కేసుల్లో తీవ్రతను బట్టి శిక్షలు పడ్డాయని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios