Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సినీ పరిశ్రమ పై భారీ చర్చకు తెరలేపిన వర్మ

  • తెలంగాణ సినీ పరిశ్రమపై చర్చకు మళ్లీ తెరలేపిన రామ్ గోపాల్ వర్మ
  • అర్జున్ రెడ్డి సినిమా తెలంగాణ పరిశ్రమ ఏర్పాటుకు నాంది పలకాలన్న వర్మ
  • మూస ధోరణిలో సాగుతున్న ఈ పరిశ్రమకు భిన్నంగా తెలంగాణ పరిశ్రమ రావాలన్న వర్మ
  • తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు కొత్త టాలెంట్ ను  ప్రోత్సాహించాలని అకాంక్ష
ramgopal varma comments on telangana film industry making buzz

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఒక్కటే. అయితే పరిశ్రమలో తెలంగాణ వాళ్ల వాటా అంటూ పోరాటాలు జరిగిన తర్వాత ప్రత్యేక తెలంగాణ సినిమా అనే అంశంపై తెరపైకి వచ్చింది. కానీ రాష్ట్రం విడిపోయాక తెలంగాణ సినిమా అనే అంశం మరుగునపడిపోయింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనే సినిమా పరిశ్రమ కొనసాగుతుందని, ఇక్కడుండే ఆంధ్ర సోదరులంతా తమవాళ్లేనని తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతో పరిశ్రమలో తెలంగాణ, ఆంధ్రా అని చూసే దృక్పథం మారిపోయింది.

తెలంగాణకు, ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి సినిమా నిర్మాతల మండలి, చాంబర్ ఆఫ్ కామర్స్ లు వేరు పడ్డట్టు ప్రొజెక్ట్ అవుతున్నా.. తెలంగాణ పేరుతో ఏర్పడ్డ సంస్థలకు రకరకాల ఇబ్బందులు తప్పడడంలేదు. పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాల్లో వివిధ సంఘాల మధ్య విబేధాలు సహజంగానే వున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం తెలుగు సినిమా అంతా ఒక్కటేనని, హైదరాబాద్ లోనే పరిశ్రమ వుండాలని, ఎక్కడికీ తరలి వెళ్లాల్సిన అవసరం లేదని భరోసా ఇవ్వడమే కాక పరిశ్రమ వర్గాల వారికి కావాల్సినంతకంటే ఎక్కువే అండగా వుంటోంది. దీంతో తెలుగు సినీ పరిశ్రమ అంతా ఒక్కటే అనే భావన ఏర్పడింది.

మరోవైపు తెలంగాణ సినిమా అంటూ ప్రత్యేకంగా కొన్ని సంఘాలు వేరుగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నా.. సినిమా అంటే తెలుగు సినిమానే అనే పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతోంది.

అయితే తెలుగు సినిమాల్లో ఇటీవల కాలంలో తెలంగాణ భాష,యాసకు పెరిగిన ప్రాధాన్యత ఇక్కడి ప్రభుత్వాధినేతలను సైతం ఆకట్టుకుంది. ఆ కోవలోనే పెళ్లి చూపులు, ఫిదా, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలను మంత్రి కేటీఆర్ మాత్రమేకాక ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పొగడ్తలతో ముంచెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లోనే రామ్ గోపాల్ వర్మ తాజాగా అర్జున్ రెడ్డి సినిమాపై, హీరో విజయ్ దేవరకొండపై చేసిన కమెంట్స్ కొత్త చర్చకు దారితీస్తున్నాయి.

అర్జున్ రెడ్డి సినిమాపై ఇటీవల సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర కమెంట్స్ చేశారు. అర్జున్ రెడ్డి సినిమా తెలంగాణ సినీ పరిశ్రమ ఏర్పాటుకు నాంది కావాలని వర్మ ఆకాంక్షించారు. అంతే కాదు.. అర్జున్ రెడ్డి సినిమా చూశాక..తెలంగాణ ప్రాంతం నుంచి గొప్ప నటీనటులు, దర్శకులు రావటానికి ఎంతో దోహగ పడుతుందని వర్మ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు సాగిన ధోరణిలో కాకుండా తెలంగాణ మట్టిలోంచి పుట్టే కథలు సాంస్కృతికంగా, భాషా పరంగా కొత్త ఒరవడి సృష్టించగలవని వర్మ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రాంతం నుంచి పరిశ్రమకు కొత్త టాలెంట్ రావాల్సిన అవసరం వుందని, తెలంగాణ నేపథ్యంలో సాగే కథలు కూడా సినిమాలుగా మలచాలని, ఇప్పటి వరకున్న దర్శకులు ఎవరూ అలాంటి ఆలోచన చేయలేదని వర్మ అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ లు కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలని, తద్వారానే మూస ధోరణిలో సాగుతున్న తెలుగు సినీ పరిశ్రమ కొత్త పుంతలు తొక్కే అవకాశముందని వర్మ అన్నారు. తద్వారా తెలంగాణ సినీ పరిశ్రమను ఇప్పుడు మూస ధోరణిలో కొనసాగుతున్న తెలుగు పరిశ్రమకు భిన్నంగా ఒక ప్రత్యేక గుర్తింపున్న పరిశ్రమగా మలుచుకునే అవకాశముందని వర్మ అంటున్నారు.

 

మరెన్నో తాజా వార్తల కోసం క్లిక్ చేయండి https://goo.gl/UR95BM

Follow Us:
Download App:
  • android
  • ios